మూడు పార్టీలు…మూడు వ్యూహాలు
బిజెపి, కాంగ్రెస్, జెడి(ఎస్)లు సుదీర్ఘ భేటీలు
కర్నాటక రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి
బెంగళూరు: కర్నాటకం ఫైనల్స్ ఫలితం సోమవారం తేలిపోనున్నది. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి, జెడి(ఎస్)లు వేర్వేరుగా శాసనసభా పక్ష సమావేశాలు నిర్వహించి, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. బెంగళూరులోని గోల్ఫ్‌షైర్ రిసార్ట్‌లో జెడి(ఎస్) శాసనసభా పక్షం, బెంగళూరులోని యశ్వంతపురలో కాంగ్రెస్ శాసనసభాపక్షం, అలాగే మరో హోటల్‌లో బిజెపి శాసనసభాపక్షం సమావేశమైంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కెసి వేణుగోపాల్, పార్టీ ఎంఎల్‌ఎలు ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలకు చెందిన మొత్తం 16 మంది రాజీనామాలు చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం అనిశ్చితిలో పడిన సంగతి తెలిసిందే. ఇద్దరు స్వతంత్రులు కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్లో ఉంటున్న రాజీనామా చేసిన కాంగ్రెస్, జెడిఎఎస్ ఎంఎల్‌ఎలు అక్కడి నుంచి ఆదివారం ఓ వీడియో సందేశం పంపారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి రాబోమని స్పష్టంచేశారు. దీంతో స్పీకర్‌ను మినహాయిస్తే.. సంకీర్ణ ప్రభుత్వ బలం 99కి పరిమితమైంది. అటు బిజెపికి 105 మంది ఎంఎల్‌ఎలతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఉంది. ఇదిలావుండగా, సుప్రీం కోర్టులో కూడా కర్ణాటక రాజకీయాలకు సంబంధించి రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. విప్ జారీ విషయంలో ఒకటి కాగా.. సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలంటూ ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఆదివారం సుప్రీం కోరు ను ఆశ్రయించారు. ఈ రెండు తీర్పులు సోమవారం రానున్నాయి.