HomeNewsBreaking Newsకరోనా సోకిన వారి ఇళ్ల వద్ద  నిషేధాజ్ఞలు

కరోనా సోకిన వారి ఇళ్ల వద్ద  నిషేధాజ్ఞలు

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై మరింత కఠినం
ఆదిలాబాద్‌లో వైద్యుని కలకలం
నిషేధిత ప్రాంతాలుగా 19 వార్డులు: పూర్తిగా లాక్‌డౌన్‌
112 కేంద్రాలపై నిఘా : ఐదుగురు డాక్టర్ల బృందంతో గుర్తింపు ప్రక్రియ
కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షణ
ఆందోళన కలిగిస్తున్న వరంగల్‌
నో మూవ్‌మెంట్‌ జోన్లలో మొబైల్‌ వాహనాలు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వైరస్‌ నివారణకు లాక్‌డౌన్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం.. దీనిపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. అంతే కాదు కరోనా పాజిటివ్‌గా తేలిన ప్రాంతాలను, వైరస్‌ సోకిన వారి ఇళ్లపై గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో పాటు వాటిని రెడ్‌జోన్లుగా(నిషేధిత ప్రాంతాలుగా) గుర్తించి కట్టుదిట్టమైన చర్యలను ప్రారంభించింది. కరోనా కలవరం సృష్టిస్తున్న పట్టణాలకు 5 కిలోమీటర్ల దూరం నుంచి రాకపోకలు నిషేధించారు. నిర్మల్‌, భైంసా పట్టణాలకు 5 కిలోమీటర్ల దూరాన్నే  బారికేడ్లు పెట్టి రాకపోకలు నిషేధించారు. ఈ పట్టణాల్లో పాజిటివ్‌ తేలిన వారి ఇళ్ల చుట్టూరా 500 మీటర్ల మేర రెడ్‌ జోన్లుగా ప్రకటించి పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ఆదిలాబాద్‌లో రిమ్స్‌ (రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో పనిచేస్తున్న కంటి వైద్యనిపుణులు ఇద్రిస్‌ ఇక్బాని కలకలం సృష్టించారు. ఆయన ఇటీవల మర్కజ్‌ వెళ్లి వచ్చిన విషయాన్ని దాచిపెట్టి విధులకు హాజరయ్యారు. సర్జరీలు చేశారు. రోగులను పరీక్షించడంతో పాటు ఉన్నతాధికారుల సమావేశాల్లోనూ పాల్గొన్నారు. సర్జరీల సమయంలో ఆయనకు సహాయకారిగా ఉన్న వారిలో ఒకరిద్దరికి కూడా కరోనా లక్షణాలు కనిపిస్తుండడంతో ఒక్కసారి రిమ్స్‌ ఆసుపత్రిలో కలకలం రేగింది. ఆయనను కలిసిన వారు, ఆయనతో విధుల్లో పాల్గొని అనంతరం వారు వారి సహచరులను కలుసుకోవడంతో వారిలో, ఆయనతో ఓపిలో చూపించుకున్న వారు ఇలా ఎంత మంది ఉంటారనే దానిపై ఆదిలాబాద్‌ యంత్రాంగం దృష్టి పెట్టింది. ఆయనకు ప్రైవేటు ప్రాక్టీస్‌ కూడా ఉండడంతో అక్కడ కూడా ఎవరెవరు వచ్చారు, ఎందరు ఆయన వద్ద చికిత్స పొందారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. అన్ని తెలిసి ఇలా చేసినందుకు సదరు డాక్టర్‌పై డైరెక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సదరు డాక్టర్‌ను రిమ్స్‌లోనే ఐసోలేషన్‌ వార్డులో ఉంచి  చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఒకరు పాజిటివ్‌తో గాంధీలో చికిత్స పొందుతూ మరణించడంతో  జిల్లా వ్యాప్తంగా కలవరం మొదలైంది. కాగా, హైదరాబాద్‌ తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్న వరంగల్‌.. రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 30 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క వరంగల్‌ లోనే 20 పాజిటివ్‌ కేసులు ఉండడం గమనార్హం. దీంతో ఇక్కడ హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇప్పటికే ఇక్కడ 15 ప్రాంతాలను నో మూవ్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించగా, ఈ ప్రాంతాలలో మరింత నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. ప్రతి ఇంటికీ అవసరమైన సరకులు, ఇతరత్రా పంపిణీ చేయడానికి మొబైల్‌ వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా స్ప్రే చేస్తూ శుభ్రం చేస్తున్నారు. 25 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటుచేసి ప్రతి ఒక్క దానిని పరిశీలిస్తూ వెంటనే తగు చర్యలు తీసుకుంటున్నారు. ఖాజిపేటలోని హాట్‌స్పాట్‌ ప్రాంతంలో తాజాగా 12 మందికి పాజిటివ్‌ తేలగా వీరిలో 11 మందిని ఎంజిఎంకు తరలించారు. వి దేశాల నుంచి వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. కరీంనగర్‌కు వచ్చిన 14 మంది ఇండోనేషియన్లపై వీసా నిబంధనల ఉ ల్లంఘన, ఎపిడమిక్‌ డిసీజెస్‌ ఆక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. ఈ 14 మందిలో ఇప్పటికే 10 మందికి పాజిటివ్‌ తేలింది. అలాగే హైదరాబాద్‌కు వచ్చిన విదేశీయుల వివరాలను కూడా పూర్తిగా సేకరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు తరలించడం, ఐసోలేషన్‌కు తరలించడం చేపట్టామని, మిగతావారిని కూడా అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌ తర్వాత కలవరపెడుతున్న నిజామాబాద్‌ జిల్లాలోనూ కరోనా తన తీవ్రతను తగ్గించలేదు. ఈ జిల్లాలో కొత్తగా 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి చెందడంలో మరో ప్రధాన కారణం లాక్‌డౌన్‌ ఉల్లంఘించడం.  ఈ విషయంపై కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలకు సోమవారం సీరియస్‌గా వ్యవహరించాలని ఆదేశించింది. లైవ్‌ వీడియో ఢిల్లీకి ప్రసారం చేయాల ని కూడా చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై మరింత అప్రమత్తమైంది. హైదరాబాద్‌ కమాండ్‌ కం ట్రోల్‌ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ మొదలు పె ట్టింది. ఉల్లంఘించిన వారిపై వెంటనే కఠిన చర్యలు చేపట్టేలా పోలీసులు, ఇతర అధికారులను ఆదేశించింది. రా ష్ట్రంలో మరింత వైద్యసేవలు మెరుగుపర్చడం కోసం గచ్చిబౌలిలో ఈ నెల 15లోగా ఆసుపత్రి ఏర్పాటు పూర్తి కా వాలని సిఎం కెసిఆర్‌ అధికారులను, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ను మంగళవారం ఆదేశించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా ఆందోళన కలిగిస్తున్నప్పటిటికీ తాజాగా ఒక్క మరణం మాత్రమే చోటుచేసుకోవడం, కొత్తగా పాటిటివ్‌ తేలుతున్న వారి సంఖ్యలో కూడా కాస్తా తగ్గుదల కనిపించడం  కొంత ఊరట కల్గించే అంశం. అయితే కర్నూల్‌ జిల్లా మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. అసలే కేసులు లేక ప్రశాంతంగా ఉన్న ఈ జిల్లాలో ఒకే సారి 54  పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా తాజాగా వీటి సంఖ్య 74కు చేరింది. విశాఖలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఇక్కడా హై అలర్ట్‌ ప్రకటించారు. విజయవాడలోని నాలుగు జోన్లలో కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మహారాష్ట్ర అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌ తేలడంతో ఢిల్లీ స్టేట్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ను మూసివేశారు. ఇదే విధంగా వైద్యసిబ్బందికి పాజిటివ్‌ తేలడంతో ముంబయిలోని జస్లోక్‌ ఆసుపత్రి, వోక్‌ ఫోర్డ్‌ ఆసుపత్రులను మూసివేశారు. ఈ నెల 14తో లాక్‌డౌన్‌ ముగుస్తున్నందున దీనిపై దేశ వ్యాప్తంగా కేంద్రానికి సూచనలు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దీనిని కొనసాగించాలని ఇప్పటికే ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. అలాగే జార్ఖండ్‌, అసోం, గుజరాత్‌,  ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలు కూడా లాక్‌డౌన్‌ పొడగించాలని కేంద్రానికి సూచించారు.  ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలులో గత కొన్ని రోజులుగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతోపాటు నీతి ఆయోగ్‌ కూడా హైరిస్క్‌ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని, లో రిస్క్‌ ప్రాంతాలలో దశల వారీగా సడలించాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments