‘రోగ నిరోధక శక్తి’ పేరిట ప్రచారం
ప్రజల భయాన్ని సొమ్ముచేసుకుంటున్న వైనం
ఉత్పత్తులపై కొరవడిన నిఘా
ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా కొందరికి వ్యాపార సాధనంగా మారింది. ఒకవైపు ప్రజలు కరోనా వైరస్‌తో భయందోళన చెందుతుంటే, మరోవైపు తమ వస్తువులను విక్రయించుకునేందుకు కొన్ని వ్యాపార సంస్థలు ‘కరోనా’ను కూడా ప్రచార అస్త్రాంగా మల్చుకుంటున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ‘రోగ నిరోధక శక్తి, పరిశుభ్రత’ను పాటించాలని అనేక సందర్భాల్లో వైద్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. దీంతో ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా కొన్ని వ్యాపార సంస్థలు తమ వస్తువులను ఉపయోగిస్తే ‘రోగ నిరోధక శక్తి’ పెరుగుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి. కొన్ని సంస్థలైతే ఏకంగా ప్రకటనలు కూడా గుప్పిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలు గుప్పిస్తున్న వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను వాడడం ద్వారా ‘రోగ నిరోధక శక్తి’ పెరుగుతుందనే అంశాన్ని ఇది వరకు ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు, కనీసం ఆ విషయాన్నే కూడా ప్రస్తావించలేదు. అలాంటిది కరోనా కాలం లో వారికి ఒక్కసారిగా తమ ఉత్పత్తుల్లో ‘రోగ నిరోధక శక్తి’ ఉన్నట్టు గుర్తుకురావడం ఏమిటని పలువుర వినియోగదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని సంస్థలు ఐసిఎంఆర్ సూచించిన అంశాలను తమ ఉత్పత్తుల్లో ఉన్నట్టు ప్రకటించుకుంటున్నాయి. వాస్తవంగా వారి ఉత్పత్తుల్లో ఎంత వరకు రోగ నిరోధక శక్తి ఉన్నది, ఐసిఎంఎఆర్ సూచనలు ఎంతవరకు పాటించారు? ఎవరికి వారుగా దృవీకరించుకునేందుకు అవకాశం లేదని పలువురు చెబుతున్నారు. సాధారణంగా ఆహార ఉత్పత్తుల్లో ఎంత వరకు రోగ నిరోధక శక్తి ఉన్నది, ఆ ఉత్పత్తిలో ఎలాంటి ఔషదాలు, ఆరోగ్యకరమైన అంశాలు ఉన్నాయనే అంశాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ, ఆహార సంస్థలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడిన వారే తమ ఉత్పత్తుల్లో ఏ అంశాలు ఉన్నాయనేది ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. పైగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ జారీ చేసిన నంబర్‌ను తమ ఉత్పత్తులపై ముద్రించాలి. కానీ ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ తమ ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉంటే, వారి అమాయకత్వాన్ని కొన్ని వ్యాపార సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సి విటమిన్ బాగా తీసుకోవాలని వైద్యులు సూచించడంతో కొందరు వ్యక్తులు ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలతో తయరు చేసిన పండ్లను విక్రయిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. మరో వైపు కొన్ని ఆహార పదార్థాల విషయంలో కల్తీ ఉన్నట్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సర్వేలో తేలినట్టు సమాచారం.
కొరవడిన నిఘా?
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ, రాష్ట్ర ఆహార సంస్థ సంయుక్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు నిరంతరం సోదాలు చేయాల్సి ఉంటుంది. ఆహార ఉత్పత్తుల శాంపిల్స్‌ను సేకరించి, వారు చెబుతున్నట్టుగానే ఆ పదార్థాలు ఉన్నాయా..? నియమ, నిబంధనలు, పరిశుభ్రతను పాటిస్తున్నారా అనే అంశాలపై ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఒక వేళ అందుకు భిన్నంగా ఉండి, వస్తువుకు సంబంధించిన తప్పుడు ప్రచారంచేసినా సదరు సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి ప్రక్రియ మొక్కుబడిగానే కొనసాగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు ప్రకటనలతో తప్పుదారి పట్టించడం, తమ ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు వివరాలతో ప్రకటన ఇచ్చే సంస్థలపై జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ దిశగా ఉత్పత్తులపై అధికార యంత్రాంగం పెద్దగా దృష్టి కేంద్రీకరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆరహార ఉత్పత్తులపై నిరంతరం నిఘా పెట్టి,తప్పుడు ప్రచారం చేసుకుంటున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆర్యోగాన్ని రక్షించాలని పలువురు కోరుతున్నారు.
కరోనా..వ్యాపార సాధనం
RELATED ARTICLES