న్యూఢిల్లీ : ఇండియా కొవిడ్ 19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద 15,000 కోట్ల రూపాయల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ సమావేశం బుధవారంనాడు ఆమోదం తెలిపింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అదుపు చేయడం, అధునాతన చికిత్సా సదుపాయాలు కల్పించడం, ల్యాబొరేటరీలు నెలకొల్పడం వంటి చర్యల కోసం ఈ నిధులను ఉపయోగించాల్సివుంటుంది. ఈ నిధిని మూడు దశల్లో వినియోగిస్తారు. ఇందులో రూ. 7,774 కోట్లు కొవిడ్ 19 అత్యవసర సాయం కోసం వినియోగించనుండగా, మిగిలిన నిధుల మొత్తాన్ని ఒకటి నుంచి నాలుగేళ్ల వ్యవధిలో కార్యకార విధాన ప్రాతిపదికన మధ్యకాలిక తోడ్పాటు కోసం వినియోగిస్తారు. డయాగ్నొస్టిక్స్ అభివృద్ధితోపాటు అధునాతన చికిత్స సదుపాయాలను పెంచడానికి, మందులు, అత్యవసర వైద్య పరికరాలు, జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థల పటష్టత కోసం ప్రథమ ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో సరికొత్త చొరవలు, ఆవిష్కరణల కోసం కూడా ఈ మొత్తాలను వినియోగిస్తారు.