ఇప్పటికిదే రాష్ట్రంలో రికార్డు
మరో 8 మందికి మృత్యువు
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తున్నది. ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో శనివాంనాడు రాష్ట్రంలో ఏకంగా 253 కొవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 182కి చేరింది. శనివారం నమోదైన 253 కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలోనే 179 పాజిటివ్‌లు గుర్తించారు. అంతేగాకుండా, గ్రేటర్ హైదరాబాద్ కాకుండా దాన్ని ఆనుకొని వున్న రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 11, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో కొత్తగా 14 కేసులు నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో ఈసారి కరోనా విజృంభించింది. ఈ జిల్లాలో అనూహ్యంగా 24 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో రోగి అంత్యక్రియలకు హాజరైన 19 మందికి ఒకేసారి కరోనా సోకింది. వారందరికీ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో మరో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో క్రమం తప్పకుండా కేసులు నమోదు కావడం భయంగొల్పుతోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, నల్గొండ, ములుగు, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో రెండేసి కేసులు నమోదుకగా, సిద్దిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదైంది. వలసలు, ప్రవాసులకు సంబంధించి శనివారం ఎలాంటి కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 4288 కేసులు స్థానికంగా నమోదైనవే. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4737కి పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 2203 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2352 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.
253 కరోనా కేసులు
RELATED ARTICLES