వైరస్ అధికంగా ఉన్న దేశాల జాబితాలో మూడవ స్థానానికి చేరువలో ఇండియా
ఒక్క రోజే 24,850 కొత్త కేసులు, 613 మరణాలు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. గత వారం రోజులుగా నిత్యం రికార్డుస్థాయిలో కొత్త కేసులు బయపడుతున్నాయి. వరుసగా మూడవ రోజు కూడా 20 వేలకుపైగా మంది కరోనా బారిన పడుతుండడం తీవ్ర కలవరాన్ని రేపుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం నాటికి కేవలం 24 గంటల్లోనే మరో 24,850 పాజిటివ్ కేసులు రావడం మరింత భయాంతోళనలను కలిగిస్తోంది. దీంతో దేశం లో మొత్తం 6,73,165 మందికి మహమ్మారి సోకింది. అంతే కాకుండా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ దూసుకెళ్తుంది. తా జాగా మరో 613 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 19,268కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఒక్క రోజు గడువులో భారీ సంఖ్యలో కేసులు, మరణాల సంభవించడం ఇదే తొలిసారి. జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులతో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరువయ్యింది. తాజాగా కేసుల సంఖ్య 6,73,165కు చేరడంతో రష్యా (6,73,564) దగ్గరగా ఉంది. ప్రస్తుతం 28లక్షల పాజిటివ్ కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా, 15లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఉన్న అమెరికా మినహా, బ్రెజిల్, రష్యాలలో నిత్యం దాదాపు 7వేల పాజిటివ్ కేసులు నమోదవుతుండగా భారత్‌లో మాత్రం ఆ సంఖ్య 25వేలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్19 మరణాల్లో మాత్రం భారత్ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో మొత్తం 2,44,814 యాక్టివ్ కేసులు ఉండ గా, 4,09,082 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 60.77గా ఉన్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా, ఇప్పటి వరకు మొత్తం 97,89,066 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) తెలిపింది. శనివారం ఒక్క రోజే 2,48,934 శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు రెండు లక్షల మార్కును దాటాయి. ఒక్క రోజే 7,074 కొత్త కేసులు వచ్చాయి. అదే విధంగా తమిళనాడులో కొత్తగా 4,280 కేసులు నమోదు కాగా, ఒక్క రోజులోనే ఢిల్లీ, తెలంగాణ, కర్నాటక, అసోం, బీహార్‌లో మొత్తం కలిపి 7,935 మందికి పాజిటివ్ వచ్చింది. దేశంలో తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో ఈ ఏడు రాష్ట్రాల నుంచే 78 శాతం కొత్త కేసులు వచ్చాయి.
మహారాష్ట్రలో రెండు లక్షలు దాటిన కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలోనే అత్యధిక తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి రోజులుగా రాష్ట్రంలో కొత్తగా 60 వేల కేసులుపైగా నమోదవుతుండగా, 24 గంటల్లోనే 7,074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 295 కొవిడ్ రోగులు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,00,064కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 8671మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కొవిడ్ మరణాల్లో 45 శాతానికి పైగా కేవలం ఇక్కడే సంభవిస్తున్నాయి. కొవిడ్ కేసుల్లోనూ దాదాపు 30శాతం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఇక తమిళనాడులోనూ కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దాదాపు నిత్యం ఐదువేల మంది కరోనా బారిన పడుతున్నారు. గడిచిన 24గంటల్లో 4,280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 1,07,001కి చేరింది. దేశంలో లక్ష కేసులు దాటిన రెండో రాష్ట్రంగా నిలిచింది. కొత్తగా 65 మంది మృతి చెందగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 1450 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. నిత్యం రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 2,805 మందికి పాజిటివ్ రాగా, మొత్తం కేసుల సంఖ్య 97,200కు చేరింది. తాజాగా మరో 81 మంది కరోనా కాటుకు బలి కాగా, మొత్తం 3,004 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో కొత్తగా 21 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 1,925గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 35,312 మంది కరోనా బారిన పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 26,554కు చేరింది. కొత్తగా 24 మంది మరణించగా, మృతుల సంఖ్య 773కు చేరింది. పశ్చిమ బెంగాల్ మొత్తం 736, మధ్యప్రదేశ్‌లో 598, రాజస్థాన్‌లో 447, కర్నాటకలో 335, తెలంగాణలో 295, ఆంధ్రప్రదేశ్‌లో 232 మంది మరణించారు. కేసుల విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 26,554 మంది, తెలంగాణలో 23,902 మంది, కర్నాటకలో 21,549 మంది, పశ్చిమ బెంగాల్‌లో 21,231, రాజస్థాన్‌లో 19,532, ఆంధ్రప్రదేశ్‌లో 18,693 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇక హర్యానా, మధ్యప్రదేశ్, బీహార్‌లోనూ కేసుల సంఖ్య పది నుంచి 15 వేల మధ్య కేసులు నమోదయ్యాయి.
దేశ సగటు రికవరీ రేటుకంటే రాష్ట్రాల్లోనే ఎక్కువ
దేశంలో కరోనా రికవరీ రేటు 60.77 శాతంగా ఉండగా, ఢిలీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ సహా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని త్వరితగతిన గుర్తించడం, సరైన సమయానికి వైద్య చికిత్సను అందించడం ద్వారా రికవరీ రేటులో అద్భుతమైన పురోగతిని సాధిస్తోందని, ఇప్పటి వరకు 4,09,082 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 2,44,814 యాక్టివ్ కేసులు ఉండగా, వీటి కంటే రికవరీ కేసులు 1,64,268 అధికంగా ఉన్నాయని తెలిపింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 14,856 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా, 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్‌లో రికవరీ రేటు 85.9 శాతం, లడఖ్‌లో 82.2, ఉత్తరాఖండ్‌లో 80.9, ఛత్తిస్‌గఢ్‌లో 80.6, రాజస్థాన్‌లో 80.1, మిజోరామ్‌లో 79.3, త్రిపురలో 77.7, మధ్యప్రదేశ్‌లో 76.9, జార్ఖండ్‌లో 74.3, బీహార్‌లో 74.2, హర్యానాలో 74.1, గుజరాత్‌లో 71.9, పంజాబ్‌లో 70.5, ఢిల్లీలో 70.2, మేఘాలయలో 69.4, ఒడిశాలో 69.0, ఉత్తరప్రదేశ్‌లో 68.4, హిమాచల్‌లో 67.3, పశ్చిమ బెంగాల్‌లో 66.7, అసోంలో 62.4, జమ్మూకశ్మీర్‌లో 62.4 శాతంగా రికవరీ రేటు ఉన్నట్లు మంత్రిత్వశాఖ వివరించింది.
కరోనా కేసుల్లో రష్యానూ దాటనున్న భారత్
RELATED ARTICLES