చైనా కంటే భారత్‌లోనే ఎక్కువ కేసులు నమోదు
లాక్‌డౌన్‌తో అత్యధికంగా నష్టపోయింది వలస కూలీలే
మోడీ సర్కార్ ప్రకటించిన రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీలో పేదలకు ఒరిగింది ఏమీలేదు : చాడ వెంకటరెడ్డి
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో : కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నా రు. కరోనా పుట్టిన చైనా దేశం కంటే భారతదేశలోనే కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని పేర్కొన్నారు. వైరస్ నివారణకు ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో అత్యధికంగా నష్టపోయింది వలస కూలీలేనని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకునేందుకు అంటూ మోడీ ప్రభు త్వం ప్రకటించిన రూ. 20లక్షల కోట్ల ప్యా కేజీ వల్ల పేదలకు ఒరిగింది ఏమీలేదని విమర్శించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేం ద్రంలోని బొమ్మగాని ధర్మభిక్షం భవన్‌లో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వం రాష్ట్రాలకు అందించిన సహాయం కూడా అంతంత మాత్రమేనన్నారు. ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ అంటూ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో పేదలకు కేవలం రూ. 3లక్షల 50వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే ఈ ప్యాకేజీ ప్రకటించారని విమర్శించారు. కరోనా కట్టడికి సరైన ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వైరస్ విజృంభిస్తుందన్నారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కూడా హడాహుడిగా ప్రకటించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల వలస కూలీలు, ఆసంఘటిత రంగ కార్మికుల బతులు చిన్నాభిన్నమయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ కరోనాను కట్టడి చేయకపోవడంతోనే ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు వైరస్ బారిన పడ్డారని అన్నారు. ప్రతిపక్షాలకు సంకేళ్ళు వేసి తామేదో సహాయక చర్యలు చేపడుతున్నట్లు విచ్చలవిడిగా నిబంధనలు పాటించక తిరగడంతో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. లాక్‌డౌన్ సమయంలో పేదలకు అందించిన నెలకు రూ. 1500 నగదు కేవలం రెండు నెలలలే అందించి 12 కేజీల బియ్యానికే పరమిత్తం చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ గోదాంలో 8 లక్షల కోట్ల బియ్యం నిల్వలు మూలుగుతున్నా పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. గోదాముల్లో బియ్యం తుప్పుపట్టినా, ఎలుకలు తిన్నా పర్వాలేదు.. ప్రజలకు మాత్రం పంచేది లేదు అనేలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ తీరుతో ఆకలి చావులు తప్పవని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బొగ్గును ప్రైవేట్ పరం చేసిందని, విద్యుత్‌ను కూడా క్రమబద్ధికరణ పేరుతో ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు పన్నుతుందన్నారు. లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులను నెలవారీగా తీయకుండా మూడు నెలలకు కలిపి ఒకేసారి తీయడంతో యూనిట్ల పెరుగుదలతో బిల్లులు అధికంగా వచ్చాయని చెప్పారు. దీని వల్ల ప్రజలపై అధిక భారం పడిందన్నారు. ఈ నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డిజిల్ ధరలను 15 సార్లు పెరిగాయన్నారు. లీటర్ పెట్రోల్‌పై రూ. 7.97, డిజిల్‌పై రూ. 8.88 పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము పార్టీ పిలుపుమేరకు ఇప్పటికే పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టామని చాడ పేర్కొన్నారు. మతోన్మాద రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, రాష్ట్ర సమితి సభ్యులు కెవిఎల్, రాష్ట్ర కమిటీ సభ్యులు యల్లం యాదగిరి, జిల్లా కమిటీ సభ్యులు దోరెపల్లి శంకర్, బేజవాడ వెంకటేశ్వర్లు, దూళిపాల ధనుంజయ్‌నాయుడు, మేకల శ్రీనివాస్‌రావు, పోకల వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, మూరగుండ్ల లక్ష్మయ్య, తొట్ల ప్రభాకర్ పాల్గొన్నారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం
RELATED ARTICLES