ముస్లిం మత పెద్దల సహాయం తీసుకోవాలి
సిఎంకు చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్ : ఢిల్లీ మర్కజ్ సమావేశానికి వెళ్ళి వచ్చిన వారు వైద్య పరీక్షలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లిం మత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సహాయం తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు కరోనా పై పోరాడడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఈ పోరాటంలో అందరిని భాగస్వాములు చేయాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 13-15 తేదీల్లో ఢిల్లీలో మర్కజ్ నిజాముద్దీన్ సమావేశానికి విదేశీ ప్రతినిధులు 300 కు పైగా హాజరైనట్లు, దేశం నలుమూలల నుండి వందలాది మంది పాల్గొన్నట్లు తెలుస్తోందని ఏదో ఒక మతం వల్లే దేశంలో కరోనా ప్రబలి నట్లు ప్రచారం సరికాదని ఆయనన్నారు. నిజానికి గత నెల 13వ తేదీ దేశ ప్రధాని మాట్లాడుతూ ఇంకా మన దేశంలో కరోనా ప్రమాద ఘటికలు మోగలేదని అన్న విషయాన్ని గుర్తూ చేస్తూ కరోనా తీవ్రతను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని అప్పటికే మన దేశంలో కరోనా సోకిన విదేశీయులు, విదేశాల నుండి కరోనా బారిన పడి తిరిగి వచ్చిన స్వదేశీయులను గుర్తించడంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని చెప్పారు. ఇప్పుడు నిజాముద్దీన్ మర్కజ్ వారిపై తప్పంతా వేయడం సబబు కాదని అన్నారు. ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తలే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ముందు తీసుకొని ఉంటే ఇంత సమస్య ఉత్పన్నం అయ్యేది కాదని అన్నారు. ఏదేమైనా ఎవరిది తప్పు అని వేలెత్తి చూపించే సమయం ఇది కాదని అన్నారు. అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవాలన్నారు. ఇంతకు మించి వేరే దారి లేదని చెప్పారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి భేషాజాలు వదిలి ముస్లిం మత పెద్దలందరిని పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కరోనా వ్యతిరేక పోరాటంలో అందరినీ భాగస్వామ్యం చేయాలని కోరారు.
కరోనాపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
RELATED ARTICLES