సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొవిడ్ ప్రత్యేక ఆసుపత్రిని ఎందుకు అందుబాటులోకి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య సిబ్బంది ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని, విద్యుత్ బిల్లుల తగ్గింపుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంథని నియోజకవర్గంలో దళితుడు రంగయ్య లాకప్‌డెత్‌పై న్యాయ విచారణ జరపాలని కోరారు. జూమ్ యాప్ ద్వారా శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితి గందరగోళంగా ఉన్నదని, హైదరాబాద్ మహానగరం కరోనా కేసుల పెరుగుదలతో అతలాకుతలమవుతోందన్నారు. మరోవైపు అధిక బిల్లులు రావడంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇదే విషయాలను ముఖ్యమంత్రికి చెబుదామంటే ప్రతిపక్షాలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, ఆందోళన చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. మరోవైపు అధికార పార్టీ నేతలకు ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రతిపక్షాలకే ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. సమస్యలపై చలో సెక్రెటేరియెట్ నిర్వహించిన కాంగ్రెస్ నేతలను హౌజ్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జూనియర్ డాక్టర్‌లపై దాడులు జరగడంతో సమ్మెకు పోతే మంత్రి ఈటల రాజేందర్ చర్చించి విరమింపజేశారని, కాని హామీలు అమలు కాకపోవడంతో వారు తిరిగి సమ్మె చేసే పరిస్థితి ఏర్పడడం దారుణమన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ఎవరి మాట వినడం లేదని, రాష్ట్రం కూడా అదే బాటలో పోతే ఎవరికి సమస్యలు చెప్పాలని అన్నారు. తక్షణమే ముఖ్యమ్రంతి అఖిపక్షం ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ఆఘమేఘాల మీద గచ్చిబౌలి స్టేడియంలో 1500 బెడ్లతో కొవిడ్ ఆసుపత్రిని కడితే సంతోషించామని, కాని ఎందుకు దానిని అందుబాటులోకి తీసుకురావడం లేదన్నారు. తమకున్న సమచారం మేరకు వైద్యసిబ్బంది లేనందునే దానిని ప్రారంభించడం లేదన్నారు. అలాగే వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, ఇతర సిబ్బందికి సంబంధించి 20వేల ఖాళీలు ఉన్నట్లు తెలిసిందని, తక్షణమే దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా బారిన పడిన వారందరినీ కేవలం గాంధీ ఆసుపత్రికే పంపడం సరైంది కాదని, అక్కడ సరిపడా వైద్యులు, సిబ్బంది, వెంటిలేటర్లు లేవని చెప్పారు. జర్నలిస్టు మనోజ్ సోదరుడు వీడియో ద్వారా నిర్లక్ష్యం కారణంగానే అతను మరణించారనే విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. మానవత్వంతో ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని సూచించారు.లాక్‌డౌన్‌లో మూడు నెలల బిల్లు ఒకేసారి ఇవ్వడంతో స్లాబులు మారి బిల్లులు ఎక్కువ వచ్చాయన్నారు. తక్షణమే బిల్లులను ఉపసంహరించుకోవాలని, గత ఏడాది ఇదే నెలలో వచ్చిన బిల్లులనే వేయాలని, పేదలకు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గచ్చిబౌలి ఆసుపత్రిని తెరవకపోతే, అక్కడే అఖిలపక్షంతో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కూడా లోతుగా ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకుంటోందని, దీంతో మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
కేంద్రం సాయం చేకపోగా భారాలు మోపుతోంది
కోవిడ్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అటు రాష్ట్రాలకు, ఇటు ప్రజలకు సాయం చేయకపోగా సందట్లో సడేమియా లాగా భారాలు మోపుతున్నదని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచిందన్నారు. తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్‌తో ఒక్కరు కూడా మరణించలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారని, రైలు పట్టాలపై చనిపోయిన వారు, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన 200 మంది వలస కూలీలవి మరణాలు కావా? అని ప్రశ్నించారు. కోవిడ్‌ను ఆసరా చేసుకొని కేంద్ర ప్రభుత్వం అధికారాలను మరింత కేంద్రీకృతం చేసుకున్నదని మండిపడ్డారు.
కరోనాపై అఖిలపక్షం
RELATED ARTICLES