న్యూఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి చేతన్ చౌహాన్ (73) కన్నుమూశారు. కరోనా సోకడం వల్ల శరీరంలో కొన్ని
అవయవాలు విఫలం కావడంతో ఆయన మరణించారని చేతన్ సోదరుడు పుష్పేంద్ర చౌహాన్ చెప్పారు. కొవిడ్ సోకడంతో జులై 12న ఆయన లక్నోలోని సంజయ్ గాంధీ పిజిఐ ఆస్పత్రిలో చేరారు. కొన్నేళ్లుగా జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలకు తోడుగా కరోనా వైరస్ సోకడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో గురుగ్రామ్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మూత్రపిండాలు వైఫల్యం చెందడంతో దాదాపు 36 గంటల పాటు లైఫ్ సపోర్ట్‌తో చికిత్స అందించారు. చేతన్‌కు భార్య, కుమారుడు వినాయక్ ఉన్నారు. ఇదిలా ఉండగా, 1947, జులై 21న జన్మించిన చేతన్ చౌహాన్.. భారత జట్టు ఓపెనర్‌గా అందరికీ సుపరిచితమే. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్‌కు సుదీర్ఘకాలం ఓపెనింగ్ భాగస్వామిగా ఆయన ఉన్నారు. 40 టెస్టులు ఆడారు. మహారాష్ట్ర, ఢిల్లీ తరఫున రంజీల్లో ఆడారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవుల్లో కొనసాగారు. ఢిల్లీ ప్రధాన సెలక్టర్‌గా సేవలు అందించారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆయన భారత జట్టు మేనేజర్‌గానూ పనిచేశారు. నిఫ్ట్ చైర్మన్‌గానూ ఉన్నారు. రాజకీయాల్లోనూ ఆయన రాణించడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా నుంచి 1991, 1998లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషించారు. 2018, ఆగస్టు వరకు ఉత్తర్ ప్రదేశ్ క్రీడామంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో సైనిక సంక్షేమం తదితర శాఖలకు మంత్రిగా ఉన్నారు. కాగా, కరోనాతో ఇప్పటి వరకు ఇద్దరు మంత్రులు ప్రాణాలు కోల్పోయారు.
కరోనాతో మాజీ క్రికెటర్, యుపి మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూత
RELATED ARTICLES