జులై నెలాఖరు నుంచే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలి
అధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
ప్రజాపక్షం / హైదరాబాద్ : జులై నెలాఖరు నుంచే కాళేశ్వరం నుంచి నీటి ని ఎత్తిపోసేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నుంచి 2 టిఎంసిలు, వచ్చే ఏడాది నుంచి 3 టిఎంసిల నీళ్లను గోదావరి నుంచి ఎత్తిపోయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది రోజుకు రెండు టిఎంసిల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి 3,800 మెగావాట్లు, వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి రోజుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి మొత్తం 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరమని పేర్కొన్నారు. కావాల్సినంత విద్యుత్‌ను సమకూర్చుకుని, గోదావరిలో నీటి ప్రవాహం ఉండే ఆరు నెలల పాటు నిర్విరామంగా 24 గంటల పాటు సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రతీ ఏడాది దాదాపు 540 నుంచి 600 టిఎంసిల నీళ్లను ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరు అం దించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిఎం వివరించారు. ఎత్తిపోతల పథకాలకు వినియోగించే కరెంటు కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సిఎం వెల్లడించారు. ఎత్తిపోతల పథకాల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలు పరిశీలించాలని సిఎం సూ చించారు. వచ్చే నెల 10వ తేదీలోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తి చేయాలని సిఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని లిఫ్టు చేయడానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా చేసే అంశంపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్‌లో విస్తృత సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎంపి జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదలశాఖ సలహాదారు పెంటారెడ్డి, ఇఎన్సీ మురళీధర్ రావు, ట్రాన్స్ కో జెఎండి సి.శ్రీనివాసరావు, జెన్ కో-ట్రాన్స్ కో డైరెక్టర్లు సూర్య ప్రకాశ్, వెంకట్రాజం, జగత్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. “గోదావరిలో నీటి ప్రవాహం ఉండే జూన్ నుంచి డిసెంబర్ వరకు నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉంటుంది. జూన్, నవంబర్ మాసాల్లో రోజుకు 2 టిఎంసిల చొప్పున, జులై నుంచి అక్టోబర్ వరకు నెలకు మూడు టిఎంసిల చొప్పున నీరు లిఫ్టు చేయవచ్చు. డిసెంబర్ మాసంలో కూడా ఒక లిఫ్టు నడిపి కొంత నీరు తీసుకోవచ్చు. ఏ నెలలో ఎంత నీరు తీసుకోవచ్చు, దీనికి ఎంత కరెంటు అవసరం పడుతుందో శాస్త్రీయంగా అంచనా వేయాలి. ఈ సమయంలో సరిపడినంత విద్యుత్తును సరఫరా చేయడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి” అని ముఖ్యమంత్రి సూచించారు. ‘85 శాతం తెలంగాణ భూభాగంలో వ్యవసాయానికి, మంచినీటికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని గోదావరి నుంచే తీసుకోవాలి. గోదావరిలో తెలంగాణకు 954 టిఎంసిల నీటి వాటా ఉంది. ఈ నీటిని వాడుకోవడానికి అన్ని రకాల అనుమతులున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ర్ట తో ఒప్పందం కూడా చేసుకున్నాము. 44 ఏండ్ల సి. డబ్ల్యు.సి. లెక్కల ప్రకారం మేడిగడ్డ వద్ద పుష్కలమైన నీటి లభ్యత ఉంది. కాబట్టి గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో నీటిని లిఫ్టు చేయాలి. మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్ మానేరుకు ఈ ఏడాది 2 టిఎంసిలు లిఫ్టు చేయాలి. రివర్స్ పంపింగ్ ద్వారా ఒక టిఎంసిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, మరో టిఎంసిని మల్లన్న సాగర్ కు లిఫ్టు చేయాలి. వచ్చే ఏడాది ఎల్లంపల్లి వరకు మూడు టిఎంసిలు, కొండపోచమ్మ సాగర్ వరకు రెండు టిఎంసిలు నీటిని తరలించి, రిజర్వాయర్లను, చెరువులను నింపాలి.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించిన 22 లక్షల ఎకరాలకు మాత్రమే కాకుండా, శ్రీరాం సాగర్ ఆయకట్టుకు, గుత్ప-అలీసాగర్ పథకాలకు, నిర్మల్- ముధోల్ నియోజకవర్గాలకు, గౌరవల్లి ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గానికి నీరివ్వాలి. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు ఏడాదికి రెండు పంటలకు నీరందించాలి. ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంటలు పండించాలి. కేవలం సాగునీరే కాకుండా మంచినీటికి, పరిశ్రమలకు కూడా కాళేశ్వరం ద్వారా నీరందించాలి” అని సిఎం చెప్పారు.