కొలంబో: మూడు వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమి నుండి తేరుకోకముందే వెస్టిండీస్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా వెస్టిండీస్ జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఇటీవలి కాలంలో విండీస్, భారత్ జట్లు చాల సార్లు జరిమానాకు గురవుతున్నాయి. నిర్ణీత సమయం కంటే కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని జట్టు రెండు ఓవర్లు ఆలస్యంగా వేసినట్లు మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ గుర్తించారు. దీంతో విండీస్ జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. దీన్ని ఆన్ ఫీల్డ్ అంపైర్లు పాల్ విల్సన్, రుచిరా పల్లియాగారుగే, థర్డ్ అంపైర్ మారిస్ ఎరస్మస్, ఫోర్త్ అంపైర్ లైండన్ హాన్నిబాల్ ఆమోదించారు. అయితే తాను చేసిన పొరపాటును పొలార్డ్ ఒప్పుకోవడంతో అతను విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లు పట్టువదలకుండా బ్యాటింగ్ చేయడంతో లంక 1 వికెట్ తేడాతో విజయం సాధించి.. సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్ళింది. రెండో వన్డే ఈ నెల 26న జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. షై హోప్ (115; 10 ఫోర్లు) సెంచరీ చేసాడు. డారెన్ బ్రేవో (39), రోస్టన్ ఛేజ్ (41) రాణించారు. లంక పేసర్ ఇసురు ఉదానకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో శ్రీలంక 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 290 పరుగులు చేసి గెలిచింది. టాపార్డర్‌లో అవిష్క ఫెర్నాండో (50; 5 ఫోర్లు, సిక్స్), దిముత్ కరుణరత్నే (52; 7 ఫోర్లు), కుశాల్ పెరీరా (42; 4 ఫోర్లు) రాణించారు. మిడిలార్డర్ తడబడ్డా.. చివర్లో తిసారా పెరీరా (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), వనిందు హసరంగ డిసిల్వా (39 బంతుల్లో 42 నాటౌట్ 4 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడి లంకకు విజయాన్ని అందించారు.
కరీబియన్ జట్టుకు ఐసిసి షాక్!
RELATED ARTICLES