కలెక్టరేట్ ఏరియాలో నిషేధాజ్ఞలు
వ్యాపార సంస్థల మూసివేత
ప్రజాపక్షం/కరీంనగర్ బ్యూరో: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో అప్రకటిత కర్ఫ్యూ కనిపించింది. జన సంచారంతో కిటకిటలాడే జిల్లా కేంద్రం బోసిపోయి కనిపించింది. బుధవారం ఒక్క రోజే కరీంనగర్‌లో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. కరీంనగర్ సగం నగరాన్ని నిర్బంధించింది. ఆ ప్రాంతంలో విద్యా, వ్యాపార, రవాణా వ్యవస్థలను బంద్ చేసింది. నగరంలో ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఫలితంగా వ్యా పార కూడళ్లు జనం లేక వెలవెలబోయాయి. అటు ప్రత్యేకంగా వంద వైద్యబృందాలను రం గంలోకి దింపింది. ఈ వైద్యబృందాలు గురువారం కలెక్టరేట్ పరిసరాల్లోని అనుమానిత ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు చేశారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా కరోనా పరీక్షలకు ముందుకువచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఇళ్లలో నుంచి ఏ ఒక్కరు బయటకు రావద్దని కలెక్టర్, మున్సిపల్, పోలీసు కమిషనర్ తదితరులు ఇప్పటికే ప్రజలకు సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ చుట్టూ 3 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ నిషేదాజ్ఞలు విధించారు. గురువారం మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కేంద్రంలోని అనుమానిత ప్రాంతాల్లో పర్యటించి, వైద్య సిబ్బందితో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సిబ్బంది తో పాటు ఆశావర్కర్లను అప్రమత్తం చేశారు.కరోనా టెస్టులకు సంబంధించి ఆశా వర్కర్లకు ,వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు. ఆశా వర్కర్లు విధిగా మాస్కులు ధరించి విధులకు హాజరు కావాలని సూచించారు.అంతకుముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డిఎంఅండ్ హెచ్ ఒ) కార్యాలయంలో మంత్రి కమలాకర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ కరీంనగర్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టించడంతో కరీంనగర్ ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేసారు. ఇండోనేషియా నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన వారిలో ఏకంగా ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, అయితే భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ బృం దం పర్యటించిన మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కరీంనగర్‌లో వంద ప్రత్యేక బృందాలతో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. కరీంనగర్ ప్రజలు ఇంట్లోనే ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేసారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అధికారులను, ప్రజా ప్రతినిధుల ను అప్రమత్తం చేసిందని అన్నారు.