ఆర్‌టిసి డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత
మృతదేహాన్ని కరీంనగర్‌డిపో వైపు తీసుకువెళ్లకుండా పోలీసుల అడ్డగింత
ఎంపి బండి సంజయ్‌కుమార్‌పై పోలీసుల దాడి
సిపి ఇంటి ముట్టడికి యత్నం
కెసిఆర్ నిరంకుశ పాలన విడనాడాలి : చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం/ కరీంనగర్ : తెలంగాణ ఆర్‌టిసి జెఎసి పిలుపునిచ్చిన సకల జనుల సమర భేరిలో బుధవారం గుండెపోటుతో మృతిచెందిన ఆర్‌టిసి డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. అంతిమయాత్రను ఆరేపల్లిలోని బాబు ఇంటి నుంచి కరీంనగర్ ఆర్‌టిసి డిపో వైపు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, ఆర్‌టిసి కార్మిక సంఘాల జెఎసి, వివిధ పార్టీల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. డిపో వైపు వెళ్లేందుకు అనుమతి లేదని., అంత్యక్రియలను బాబు ఇంటి సమీపంలోని శ్మశానవాటికలోనే పూర్తి చేయాలని పోలీసులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిపో వైపు తీసుకెళ్తామంటూ ఎంపి బండి సంజయ్, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను సంజయ్, కార్యకర్తలు బలవంతంగా తొలగించి ముందుకు దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. ఆ తర్వాత బాబు భౌతికకాయాన్ని పోలీసులు ఆయన ఇంటికి సమీపంలోని శ్మశానం వైపు తరలించారు. అంతకు ముందు కూడా డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తతలు కొనసాగాయి. ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ గురువారం ఉదయం నుంచి కరీంనగర్ జిల్లా అరేపల్లిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎంపి బండి సంజయ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాది గ, విమలక్క తదితరులు మృతదేహం వద్ద బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. ఆర్‌టిసి జెఎసి కీలక నేతలు థామస్ రెడ్డి, రాజిరెడ్డితో పాటు అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన వివిధ డిపోలకు చెందిన కార్మికులు ఆందోళన చేశారు.