సిపిఐ 24వ మహాసభ ప్రారంభోత్సవ ప్రసంగంలో రాజా ఉద్ఘాటన
బొమ్మగాని కిరణ్ కుమార్ కా॥ గురుదాస్ దాస్గుప్తా నగర్/విజయవాడ
మునుపెన్నడూ లేని రీతిలో నెలకొన్న నూతన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సూత్రబద్ధ ప్రాతిపదికపై కమ్యూనిస్టు ఉద్యమ ఏకీకరణ జరగాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. సిపిఐ నిబద్ధతతో ఏకీకరణ కోరుకుంటున్నదని, నూతన రాజకీయ పరిస్థితుల్లో దేశంలోని విప్లవకర శక్తులు, కమ్యూనిస్టు శక్తులు దగ్గరగా రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కమ్యూనిజం అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతమని, అది దావానలంగా విస్తరించి సర్వం నాశనం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారని రాజా గుర్తు చేశారు. అంటే ఆర్ఎస్ఎస్, బిజెపిలు నేతృత్వం వహిస్తున్న ఫాసిస్టు శక్తులకు ప్రధాన ప్రత్యర్థి కమ్యూనిస్టులు, కమ్యూనిజం సిద్ధాంతం మాత్రమేనని స్పష్టమవుతున్నందున వామపక్ష, కమ్యూనిస్టు శక్తుల ఐక్యత అవసరమని నొక్కి చెప్పారు. విజయవాడలోని కామ్రేడ్ గురుదాస్ దాస్ గుప్తా నగర్ (ఎస్ఎస్ కన్వెన్షన్)లోని కామ్రేడ్ షమీమ్ ఫైజీ హాల్లో జరుగుతున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభకు డి.రాజా, సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సిపిఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ కార్యదర్శి దేవరాజన్లు హాజరయ్యారు. తొలుత నారాయణ స్వాగతోపన్యాసం చేసిన అనంతరం రాజా ప్రసంగిస్తూ 24వ జాతీయ మహాసభ ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ వర్తమాన రాజకీయ పరిస్థితులు, కమ్యూనిస్టుల కర్తవ్యంపై తన ప్రసంగంలో వివరించారు.
వామపక్ష కేంద్రంగా ఐక్యత:
ఆర్ఎస్ఎస్, బిజెపిలను ఓడించేందుకు ప్రతిపక్షాలకు విభిన్నమైన ఎజెండా అవసరమని, వామపక్షాలు కేంద్ర స్థానంలో ఉంటూ లౌకిక, ప్రజాతంత్ర పార్టీల ఐక్యతను సూత్రప్రాయంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని డి.రాజా అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా 2024 సాధారణ ఎన్నికలలోగా వామపక్షాలు చొరవ తీసుకొని ఐక్యత కోసం ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ప్రత్యామ్నాయ ఎజెండాలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు కూడా ఉంటాయన్నారు. ప్రజా వైద్యం, ప్రభుత్వ విద్య, భూమి, ఇళ్ళు, ఉద్యోగం, ఆహారభద్రత వంటి ప్రాథమిక డిమాండ్లు ఎజెండాలో ఉంటాయని, సంస్కర్తల ఆశయాలు ఇమిడి ఉంటాయని వివరించారు.
కులాన్ని విస్మరిస్తే విజయం సాధించలేం
భారతదేశంలో కేవలం వర్గ పోరాటాలు చేస్తే సరిపోదని, పాతుకుపోయిన కుల వ్యవస్థను విస్మరిస్తే విప్లవ వ్యూహం విజయవంతం కాబోదని రాజా స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్, బిజెపిల కలయికను సైద్ధాంతికంగా, సంపూర్ణంగా ఓడించాలంటే వర్గ, కుల పోరాటాల ద్వారా సామాజిక సాధికారత అవసరమని తెలిపారు. ఆర్ఎస్ఎస్ గతాన్ని తిరగరాసి, తన చరిత్రను ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా సంఘ సంస్కర్తల గొప్ప రచనలతో తిప్పికొట్టడం సైతం ప్రత్యామ్నాయ ఎజెండాలో ఉండాలని చెప్పారు. సంస్కరణల కోసంపాటు
ఏకీకరణ నేటి అవసరం
పడిన మధ్యయుగాల కవులు కబీర్, రవిదాస్లు, హేతబద్ధతపై పెరియార్ కృషి, అణగారిన వర్గాల కోసం నారాయణ గురు, అంబేడ్కర్ల కృషి, ఆలోచనలు, ఆశయాలు పోరాటంలో భాగం కావాలని అన్నారు. దేశంలో యువ జనాభా పెరిగిపోయిందని, అదే సమయంలో వారు నైరాశ్యం, మానసిక అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. సమాజంలో వ్యక్తిగత భావం పెరిగిపోతున్నదని,విలువలు దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అధిగమించేందుకు సౌభ్రాతృత్వం, సంఘీభావం, శాంతి పంచాలని చెప్పారు.
నిజమే ప్రధాని రేయింబవళ్ళు పనిచేస్తున్నారు ప్రధాని మోడీ రేయింబవళ్ళు పని చేస్తున్నారని బిజెపి చెబుతుంటోందని, అది నిజమేనని, దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంలో ప్రధాని రేయింబవళ్ళు పని చేస్తున్నారని రాజా ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్, బిజెపిల నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుండి దేశం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం తీవ్ర ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయని రాజా హెచ్చరించారు. అదానీ, అంబానీల అనుకూల విధానాలను బిజెపి ప్రభుత్వం అనుసరిస్తూ నయా ఉదారవాదాన్ని మరింత వేగవంతం చేసిందని, తద్వారా వారిరువురి బ్రాండ్లను సృష్టించిందన్నారు.ఈ పెట్టుబడిదారీ ఆశ్రిత విధానాలు దేశ ఆర్థిక స్వావలంబనకు పెను ముప్పును సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వ్యవస్థలను అణిచివేయడమే ఆర్ఎస్ఎస్ ఎజెండాగా మారిందన్నారు. హిందీ, హిందూ , హిందుస్థాన్ల పేరుతో ఏకసంస్కృతిని తీసుకువచ్చి భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బిజెపిలు ప్రయత్నిస్తున్నాయన్నారు. లౌకికవాదం, సమాఖ్యవిధానం, సంక్షేమరాజ్య వాదాలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తున్నదని మండిపడ్డారు.
విజయవాడకే ఆ ఖ్యాతి
దేశంలో సిపిఐ జాతీయమహాసభలు మూడుసార్లు నిర్వహించిన ఏకైక నగరంగా విజయవాడకు ఘనత దక్కిందని రాజా అన్నారు. చండ్ర రాజేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్య, మగ్దూం మొహియుద్దీన్, నీలం రాజశేఖర్ రెడ్డి తదితరులు తమ శక్తి, శ్రమను దారపోసి తెలుగు నేలపై కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేశారన్నారు.