చరిత్ర కమ్యూనిస్టులదే& చరిత్ర సృష్టించేది వారే
అధికారం ఉన్నా లేకపోయినా పేదవాడి వెంటే…
దొడ్డా నరసయ్య వర్ధంతి సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ఎర్రజెండాలతో భారీ ర్యాలీ…. ఎరుపెక్కిన చిలుకూరు
ప్రజాపక్షం/కోదాడ (చిలుకూరు): “చరిత్ర కమ్యూనిస్టులదే&చరిత్ర సృష్టించేది కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని కొందరు అసత్యప్రచారాలు చేస్తున్నారు. కమ్యూనిజానికి అంతం లేదని ప్రపంచ చరిత్రలు చెబుతున్నాయి. సృష్టి ఉన్నంతకాలం ఉండేది కమ్యూనిస్టులే” అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, స్వాతంత్య్ర సమరయోధులు, హుజూర్‌నగర్ నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎ దొడ్డా నర్సయ్య 24వ వర్ధంతి సభ సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సాంబశివరావుతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి డాక్టర్ అందె సత్యం, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొన్ని పార్టీలు అధికారంలో ఉన్నంతకాలం ఉంటాయని అధికారం పోగానే కనుమరుగవుతాయని, అధికారం ఉన్నా లేకపోయినా పేదవాడి వెంట ఉండేది కమ్యూనిస్టు పార్టీయేనని అన్నారు. నాడు పేదల కోసం ఎర్రజెండా చేతబట్టిన దొడ్డా నర్సయ్య పోరాటం కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమన్నారు. టిఆర్‌ఎస్‌తో సిపిఐ ఎలాంటి పొత్తులు పెట్టుకోలేదని, ఏ పార్టీ వద్దకు పోలేదని, ఆ పార్టీలే కమ్యూనిస్టులను ఆహ్వానిస్తున్నాయన్నాయని ఆయన చెప్పారు. 1999 వరకు టిడిపితో పోత్తు ఉందని, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటే వదిలేశామని, ఎన్నికల్లో సీట్ల కోసమే పొత్తు
అనేది కమ్యూనిస్టు పార్టీ తమ పార్టీ సిద్ధాంతమే స్పష్టం చేశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో సిపిఐ పార్టీ నియోజకవర్గ కమిటీలను వేస్తుందని కమిటీ నిర్ణయం మేరకే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. కమ్యూనిజాన్ని చంపేయడం ఎవరితరం కాదని, సమస్యలపై పోరాడి సమాజాన్ని నడిపించాలని, ప్రశ్నించాలని ఆయన కార్యకర్తలను కోరారు. బతికివున్నంతకాలం కమ్యూనిస్టుగానే బతకాలని ఆయన పిలుపునిచ్చారు. పిరికివాడిగా ఉంటే కమ్యూనిస్టే కాదని ప్రజాగొంతుకులుగా మారాలని ఆయన అన్నారు. దొడ్డా నర్సయ్య స్ఫూర్తితో పార్టీకి తిరిగి పునర్‌వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష, పక్షపాత విధాలనాల వల్ల దేశంలో 40శాతం సంపద ఒక్కశాతం వ్యక్తుల చేతులలోనే కేంద్రీకృతమై ఉండడం విచారకరమన్నారు.
అమరుల త్యాగాలు వృధాగా కానివ్వొద్దు : పల్లా వెంకట్‌రెడ్డి
అమరవీరుల త్యాగాలను వృధా కానివ్వొద్దని పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాడు జిల్లా సూర్యాపేట జిల్లాలోని అన్ని గ్రామాల్లో కమ్యూనిస్టులతోనే ఉధృతంగా కొనసాగిందన్నారు. దొడ్డా నర్సయ్య పేదలకోసం పోలీసుల లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లారన్నారు. అనంతరం ఎంఎల్‌ఎగా శాసనసభలో ప్రజల గొంతుకయ్యారని దొడ్డా సేవలను స్మరించారు. అవకాశవాద రాజకీయాలతో కాకుండా సిద్ధాంతపరమైన లక్ష్యంతో, ఆశయంతో కమ్యూనిస్టులు పనిచేశారన్నారు. ఈ సందర్భంగా కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గ కమిటీలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహా, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొడ్డా వెంకటయ్య, మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, గీత పనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ కోటయ్య, ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చేపూరి కొండలు, ఎఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి జీవిరాజు, ధనుంజయనాయుడు, పార్టీ, ప్రజా సంఘాల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఎరుపెక్కిన చిలుకూరు
కమ్యూనిస్టుయోధుడు దొడ్డా నరసయ్య 24వ వర్ధంతి సందర్బంగా చిలుకూరు గ్రామం ఎర్రజెండాలు, ఎర్ర చొక్కాలతో ఎరుపెక్కింది. తొలుత గ్రామంలోని సిపిఐ కార్యాలయం వద్ద దొడ్డా నరసయ్య విగ్రహానికి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి, దొడ్డా నారాయణరావు తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామ శివారులోని ఫంక్షన్‌హాల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభకు ర్యాలీగా తరలివెళ్లారు. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తల నినాదాలతో గ్రామం మారుమోగిపోయింది.
కమ్యూనిజానికి అంతంలేదు
RELATED ARTICLES