HomeNewsBreaking Newsకమ్మేసిన ముసురు…

కమ్మేసిన ముసురు…

రాష్ర్టంలో జోరుగా వర్షాలు
స్తంభించిన జన జీవనం
పొంగుతున్న వాగులు, చెరువులు
తొణకిసలాడుతున్న ప్రాజెక్టులు
నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 98 మి.మీ వర్షం
ప్రజాపక్షం న్యూస్‌ నెట్‌వర్క్‌

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రాత్రి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూ జనజీవాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం దాదాపుగా స్తంభించిపోయింది. ముసురుగా కురుస్తున్న వాన రాష్ట్రాన్ని ముంచేస్తున్నది. పశ్చిమ బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా, కొన్ని చోట్ల విస్తారంగా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు దాదాపు అన్ని జిల్లాల్లో పడుతున్నాయి. వానలు, వరదలతో వాగులు, చెరువులు పొంగుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. పలు జిల్లాల్లో లోలెవల్‌ కాజ్‌వే వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. పత్తి, కంది తదితర పంటలు నీట మునిగాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలపై వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి పారుదల శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించి గేట్లు ఎత్తివేసి సామర్ధ్యానికి మించిన నీటిని దిగువకు వదులుతున్నారు.
నిజిమాబాద్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా 98 మి.మీ. వర్షపాతం నమోదైంది. భీంగల్‌ మండలం కప్పలవాగు చెక్‌డ్యామ్‌ పైనుంచి వర్షపు నీరు పారుతోంది. నవీపేట మండలం జన్నపల్లిలో పెద్ద చెరువు అలుగు పారుతోంది. లింగాపూర్‌ శివారులో వరద ధాటికి తుంగినిమాటు కాలువకు గండి పడింది. దీంతో వందల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. తీగలవాగు ఉప్పొంగడంతో ఏర్గట్ల మెట్‌పల్లి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.
నిర్మల్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం నుంచి వాన జోరుగా కురుస్తోంది. ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. నిర్మల్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా బైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి అధిక మొత్తంలో వరదనీరు వచ్చి చేరడంతో శనివారం అధికారులు నాలుగు గేట్లను ఎత్తివేసి సుద్దవాగులోకి 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శుక్రవారం ప్రాజెక్టు నీటి మట్టం 357.6 మీటర్లుండగా భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయానికి 1.1 మీటర్ల మేర పెరిగి నీటిమట్టం 358.6 మీటర్లకు చేరుకుంది. సంబంధిత సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ అధికార యంత్రాంగం హుటాహుటిన భైంసాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇంతకింతకి పెరుగుతుండటాన్ని గుర్తించిన అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన 8 వరదగేట్లలో నాలుగు వరదగేట్లను రెండు మీటర్ల మేరకు ఎత్తి సుద్దవాగులోకి 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సమయంలో ఇన్‌ఫ్లో 62 వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 358 మీటర్లకు తగ్గేంత వరకు నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వరదగేట్ల ద్వారా 40 వేల క్యూసెక్కుల నీటిని సుద్దవాగులోకి వదిలిపెట్టడంతో పరివాహక ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. బైపాస్‌ రోడ్డు వంతెన పైనుండి వరదనీరు ఉదృతి ప్రవహించడం మూలంగా రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. సమీప ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాల ముందు వరకు నీరు ప్రవహించి పరివాహక ప్రాంతంలోని పంటచేలన్నీ నీటమునిగాయి. పట్టణం పరిధిలోని లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండుకుండలా చిన్నపాటి చెరువులుగా తలపించా
కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు
దస్తురాబాద్‌ : కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు(7.603 టిఎంసి)లుగా కాగా శనివారం నాటికి ప్రాజెక్టులోకి 694.500 అడుగులు (6.039 టిఎంసి)గా నమోదైందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 40658 క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వస్తుందన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కడెం ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి 42935 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు
సారంగాపూర్‌ : మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల మూలంగా స్వర్ణ ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతున్నది. స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1182 అడుగులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు గేట్లు ఎత్తివేసి 3700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయదారులు, రైతులు, గొర్రెల, మేకల కాపలదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
నిండిన చెరువులు, పొంగుతున్న వాగులు
వరంగల్‌ : వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తుండడంతో వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరుకున్నది.ఇక వరంగల్‌ మహానగర పాలక సంస్ద పరిదిలో పలు కాలనీలలోకి నీరు చేరుకుని ప్రజలు తీవ్ర ఇబ్భందులను ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాలలో పొలాలలోకి వర్షపు నీరు చేరుకుని పంటలకు నష్టం కలిగించింది. జిలాల్లో అథ్యధికంగా మహబూబాబాద్‌లో వర్షం కురియగా ఆ తరువాత జనగామలో కురిసి శనివారం నాటికి మొత్తం 1300 మి.మి వర్షపాతం కురియాల్సి ఉండగా రెట్టింపు వర్షపాతం కురిసింది. వరంగల్‌, హన్మకొండ జిల్లాల కలెక్టర్‌లు, వరంగల్‌ నగర మేయర్‌, కమిషనర్‌ ప్రత్యేకంగా వరద ముంపుపై కంట్రోల్‌ విభాగాలను,టోల్‌ ఫ్రీ నెంబర్‌లను ఏర్పాటు చేసారు.
వాన జోరు.. వరద హోరు..
వనపర్తి : భారీ వర్షానికి వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు అన్ని గ్రామాలు తడిసి ముద్దాయ్యాయి. గ్రామాలలోని కొన్ని ఇండ్లు కూలిపోయాయి. అన్ని మండలాల్లో శుక్రవారం నుండి శనివారం రాత్రి వరకు భారీ వర్షంతో వాగులు, కుంటలు పొంగిపొర్లాయి. చిన్న, మధ్య తరహ రిజర్వాయర్లు వరద నీటితో తొణకిసలాడాయి. పలుచోట్ల రహదారులపై వరద నీటి ప్రవాహం కొనసాగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గురుకులంలోకి చేరిన వర్షపు నీరు
ఫుడ్‌పాయిజన్‌ అంటూ పుకార్లు, కొట్టి పారేసిన సిబ్బంది
ఎడపల్లి: నిజిమాబాద్‌ జిల్లా ఎడపల్లిలో పంటలు నీట మునగగా, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడపల్లి మండల కేంద్రం శివారులోని బాలికల గురుకుల పాఠశాల ఆవరణలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో చెరువును తలపిస్తుంది. పాఠశాల ఆవరణలో గల వంటగదుల చుట్టుపక్కల భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వంటలు చేసే నిర్వాహకులకు, విద్యార్థులకు ఇబ్బందులు కలిగాయి. ఇదిలా ఉండగా భారీ వర్షాలకు వంట గదుల్లో, మరుగుదొడ్లలో వర్షపు నీరు చేరడంతోపాటు విద్యార్థులు ధరించే దుస్తులు తడిగానే ఉంటున్నాయని, దీంతో ఇబ్బందులు కలుగుతాయని మూడురోజుల సెలవులు ప్రకటించి తమ తమ ఇళ్ళకు తీసుకెళ్ళాలని తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బంది సూచించగా అదికాస్త రివర్స్‌ అయి స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ అయిందంటూ పుకార్లు వెల్లువెత్తాయి. దీంతో తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని సిబ్బందిని విచారించగా అలాంటిదేమి లేదని అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే శుక్రవారం ముగ్గురు విద్యార్థులు మాత్రం ఇతర కారణాలతో అనారోగ్యం బారిన పడినట్టు విశ్వసనీయ సమాచారం.
స్థంభించిన జనజీవనం
సిద్దిపేట : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆన్ని మండలాల్లో కరుస్తున్న వర్షాలకు జనజీవనం స్థంభించించిపోయింది. ఆత్యవరసరమైన వారు మాత్రమే బయటకు వచ్చి తమ పనులు చేసుకోగా ఎక్కువ మంది ఇంటికే పరిమితమయ్యారు. వర్షాలకు చెరువులు, కుంటలు, చెడ్‌డ్యాంలకు జలకళ సంతరించుకుంది. జిల్లాలోని తొగుట మండలంలో 73.9 మిల్లిమీటర్లు భారీ వర్షం నమోదు కాగా, ఆత్యల్పంగా కొమురవెళ్లి మండలంలో 27.5 మిల్లీమీటర్లు వర్షం కురిసింది.
లోతట్టు ప్రాంతాలు జలమయం& రోడ్లు బురదమయం
జనగామ : గత మూడు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షం జనగామ జిల్లా ప్రజలను ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్లడం లేదు. మురుగు కాల్వలు పొంగిపొర్లుతూ రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్‌ రోడ్డులోని కుర్మవాడ, సెయింట్‌ మేరిస్‌ పాఠశాల ప్రాంతాలకు నీరు చేరింది. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అధికారులు అప్రమత్తమై వర్షం తీవ్రతను పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం జనగామ జిల్లా ప్రజలను ముచ్చెమటలు పట్టిస్తుంది. వ్యవసాయ పనులతో పాటు ఇతర పనులకు ఆటంకం ఏర్పడింది. ఎప్పుడు వర్షం తగ్గుముఖం పడుతుందా అని జనం ఎదురు చూస్తున్నారు.
కళకళలాడుతున్న కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు
జయశంకర్‌భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వర్షాలతో మోరంచ, చలివాగు , కాకతీయుల నాటి గణపసముద్రం చెరువు, భూపాలపల్లి మండలం బీమ్‌ఘనపూర్‌ చెరువు, గోదావరి, ప్రాణహిత నదులతో పాటు వాగులు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. జిల్లాలోని ఓపెన్‌ కాస్ట్‌ గనులు వర్షం నీటితో బురదబమయం కావడంతో మొత్తం 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు. మానేరు, గోదావరి నదుల వరద ఉధృతితో అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి దిగువకు నీటికి వదులుతున్నారు.
పరవళ్లు తోక్కుతున్న తల్లీ గోదావరి
ములుగు : ఎగువ ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా ఎడ తెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ములుగు వద్ద గోదావరి నదీ పరవళ్లు తోక్కుతూ జలకళ సంతరించుకుంది. ముళ్లకట్ట, ఏటూరునాగారం, రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద, దేవాదుల పంప్‌ హౌస్‌ వద్ద నీటి ప్రవహం చేరుతుంది. గోదావరి నదీ ఉదృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని మత్స కార్మికులు చేపలకు వేటకు వెల్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారెజ్‌ 35 గేట్లను, అన్నారం బ్యారేజ్‌ వద్ద గోదావరి వరద నీరు పోటేత్తుతుండడంతో సరస్వతి బ్యారెజ్‌ 10 గేట్లు ఎత్తి దిగువకు గోదావరి వరద నీరు వదులుతున్నారు. దీంతో ములుగు జిల్లాలో జంపన్న వాగు పోర్లుతుంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ముందస్తుగా అధికారులు సమస్యత్మక గ్రామాలకు జిసిసి ద్వారా నిత్యావసర వస్తువులను తరలించి నిలువ చేస్తున్నారు.
పొచ్చెర జలపాతానికి జల కళ
ఆదిలాబాద్‌ : భారీ వర్షాలకు పొచ్చెర జలపాతంలోకి భారీగా నీరు వచ్చి చేరుతూ జల కళను సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి కారణంగా జలపాతం జల జల జాలువారుతోంది. జలపాతం అందాలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. పచ్చని చెట్ల మధ్య ఉన్న జలపాతం అందాలను వీక్షించేందుకు పలువురు ప్రకృతి ప్రేమికులు జలపాతం వద్దకు వస్తున్నారు.
మత్తడి తొక్కిన వైరా ప్రాజెక్టు &. పలు చోట్ల రోడ్లకు గండ్లు
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెరువులు, కుంటలు కొత్త జల కళను సంతరించుకున్నాయి. ఏజెన్సీలోని చెరువులు, కుంటలు నీటితో తొనికిసలాడుతుండగా సుజాతనగర్‌ మండలం సింగభూపాలెం చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. వైరా మధ్యతరహా ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పారుతుంది. కిన్నెరసానికి వరద నీరు కొనసాగుతూనే ఉంది. గోదావరికి ఇప్పుడిప్పుడే వరద నీరు చేరుకుంటుంది. శనివారం సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 20.6 అడుగులుగా నమోదైంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నేలకొండపల్లి మండలంలో వరద ఉధృతికి చిన్నపాటి వంతెన కొట్టుకుపోయింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments