ప్రజాపక్షం / హైదరాబాద్ ; హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయల విలువైన భూములు ఆక్రమణలకు గురౌతుం టే అధికారులు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాల్ని ఎందుకు అడ్డుకోవడం లేదని మండిపడింది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం గంధమగూడలోని సర్వే నెంబర్ 43లోని 3.22 ఎకరాల సర్కారీ భూమిని ఆక్రమణ, అక్రమ నిర్మాణాలను ఒక నెల రోజుల్లోగా అడ్డుకోవాలని ఆదేశించింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారని హైదరాబాద్ వాసి కృష్ణగౌడ్ అనే సోషల్ వర్కర్ వేసిన పిల్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల డివిజన్ బెంచ్ విచారించింది. పిటిషనర్ లేవనెత్తిన భూమి విషయంపై సర్వే చేయిస్తున్నామని, పూర్తి నివేదిక అందాల్సివుందని ప్రభుత్వ లాయర్ భాస్కర్‌రెడ్డి చెప్పడంతో డివిజన్ బెంచ్ కల్పించుకుని ఏన్నాళ్లు సర్వే చేస్తారని, ఆక్రమణ జరిగే వరకూ ఏం చేశారని ప్రశ్నించింది. 24 అంతస్తుల భవనాలు వెలుస్తుంటే కళ్లు మూసుకుని ఉన్నారా? లేక నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. ఆక్రమణలు జరుగుతుంటే అధికారులు కావాలని చూడనట్లుగా ఉంటారేమోగానీ హైకోర్టు చూస్తూ కూర్చోదని తేల్చి చెప్పింది. సర్వేకు 3 నెలల సమయం కావాలని కోరడం కూడా తప్పు అవుతుందని, ఒక నెలలోనే సర్వే రిపోర్టు ఇవ్వాలని రెవెన్యూ సెక్రెటరీని ఆదేశించింది. ఏది సర్కారీ భూమినో, ఏది కాదో ఫీల్డ్‌లో ఉండే అధికారులకే కాకుండా ఆఫీసుల్లో ఉండే వాళ్లకూ తెలుసునని, అంత ఖరీదైన భూమి ఆక్రమణకు గురైందంటే సర్వే జరుగుతోందని చెప్పడమేమిటని నిలదీసింది. సర్వే అనేది రెవెన్యూ శాఖలో నిరంతర ప్రక్రియ అని, రోజుల తరబడి చేసేదేమీ కాదని వ్యాఖ్యానించింది. జరిగేది జనగనీయడం కోసమే మౌనంగా ఉంటూ ఏదో ఒక సాకు చెప్పడం పరిపాటిగా మారిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సదరు సర్వే నెంబర్‌లో భూమిపై నెల రోజుల్లోగా సర్వే చేసి క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో రిపోర్టు ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. విచారణను వచ్చే నెల 11కి వాయిదా వేసింది.
కబ్జాలపై కన్నెర్ర
RELATED ARTICLES