ప్రజాపక్షం / మేడ్చల్ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్ మండల పరిధిలోని పలు కుంటలు కబ్జాలకు గురవుతున్నా యి. దుండిగల్, గండిమైసమ్మ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమన్వయం లోపం కారణంగా కొంత మంది అక్రమార్కులు కుంటలను ఆక్రమిస్తున్నారు. కుంటలు ఎక్కడ కనబడితే అక్కడ కబ్జాదారులు వారి ఆధీనంలోకి తీసుకుని చక చకా నిర్మాణాలు చేస్తున్నారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకోవడంతో భూబకాసురులు చెరువులను, కుంటలను సైతం మింగేస్తున్నారు. పరిస్థితిని గమనించిన జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం చెరువులు, కుంటల రక్షణ బాధ్యత పూర్తిగా స్థానిక రెవెన్యూ అధికారులదేనని తేల్చి చెప్పారు. దుండిగల్ మండల పరిధిలోని బహదూర్‌పల్లి సర్వే నెంబర్ 63, 64 సందయ్య కుంటలో మట్టి నింపి చదును చేస్తూనే మరోవైపు శరవేగంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపం వల్ల సందయ్య కుంట కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారుల నుంచి సందయ్య కుంటను కాపాడాలని, వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని పలువురు కోరుతున్నారు.
కబ్జాకు గురవుతున్న సందయ్య కుంట
RELATED ARTICLES