ప్రజాపక్షం/గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కబ్జాలకు అంతులేకుండా పోతున్నది. ఉన్నతాధికారుల అండతో ఓ మాఫియా ముఠా ఇష్టానుసారంగా భూములను తమ చేతుల్లోకి లాక్కుంటున్నారు. గోదావరిఖని పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ‘త్రిమూర్తులు’, ఒక జిల్లా అధికారి.. స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో మండలంలోని నిరుపేదల భూములకు, ప్రభుత్వ భూములకు దొంగ కాగితాలు సృష్టించి విచ్చలవిడిగా కబ్జాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూబకాసురులకు రక్షణగా రామగుండం కార్పోరేషన్‌లో పాగా వేసిన బడా కాంట్రాక్టర్ నిలుస్తున్నాడని గోదావరిఖని మొత్తం కోడైకూస్తుంది. రామగుండం రెవెన్యూ కార్యాలయం పెద్దదొర కనుసన్నల్లోనే ఉంటుందని, మండలం రికార్డుల్లో ఏది ఎక్కించాలన్నా, తీసేయాలన్నా పెద్దదొరే అధికారని, ఈ ముగ్గురి దృష్టి ఏ భూమిపై పడితే ఆ భూమి వాళ్లదే అన్నట్లుగా రాత్రికి రాత్రే ఆ భూమికి సంబంధించినటువంటి దొంగ కాగితాలను తయారు చేసి ఈ భూమిలో తెల్లారే సరికి పాగా వేయడమే వీరి ఎజెండాగా, దినచర్యగా ఈ ముఠా వ్యవహార శైలి ఉందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. వీళ్ల కబ్జాకి గురైన భూ యజమానులు వీళ్ల మాటలు వింటే ఎంతోకొంత డబ్బులు పడేస్తారని, వినని వారిని వీళ్ల అనుచరులైన రౌడీ షీటర్లతో బెదిరింపులకు గురిచేయడమే కాకుండా అవసరమైతే ఈ యజమానులపై భౌతిక దాడులు చేయించి వాళ్లు అనుకున్నది సాధిస్తారని ప్రజలు వాపోతున్నారు. వీళ్లు కబ్జా చేసిన భూమి సర్వే నెంబర్ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంటే వీళ కబ్జా భూమి రికార్డుల్లో మాత్రం క్లియరెన్స్‌గా ఉంటుందని, వీళ్లే భూములను అమ్మకాలు జరిపి, తిరిగి వీళ్లే వీరి అనుచరులతో కేసులు పెట్టించి, మళ్లి తిరిగి వీరే డబ్బులు తీసుకొని సెటిల్‌మెంట్లు చేస్తున్నారని స్థానిక బాధితులు చెపుతున్నారు. ఎందరో నిరక్షరాస్యులు, నిరుపేదల భూములను కబ్జాలు చేసి వందల కోట్ల రూపాయలు బినామిల పేర్లతో పోగు చేసుకుంటున్నారని, మమ్ములను ఎవరు ఏమి చేయలేరంటూ బెదిరిస్తూ వుంటారు. మాకు నక్సలైట్లు తెలుసని ఒకరు, మాకు కెసిఆర్ దూరం చుట్టం అని మరొకరు, జిల్లా స్థాయి అధికారులు, పోలీసు పెద్దబాసులు నా దోస్తులు అని ఇంకొకరు… ఇలా బూటకపు మాటలు చెప్పుకుంటూ పేదోళ్ల రక్తాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పెద్దదొర మాటలకు లొంగని అధికారులకు శంకరగిరి మాన్యాలే గతి. రామగుండంకు రెవెన్యూ, పోలీసు అధికారులుగా ఎవరు రావాలన్నా, పోవాలన్నా ‘పెద్దదొర’ సైగ వేస్తేనే జరుగుతుంది. మీరు మా మాట వింటే సరే.. లేదంటే మీ నౌకరీలను ఊడదీస్తామని బెదిరింపులకు పాల్పడుతూ వీరు కబ్జా వ్యవహారాలను కొనసాగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వీళ్ల గూండాయిజానికి, దౌర్జన్యాలకు బయపడి బయటకు చెప్పుకోలేక రోడ్డుమీద పడి దిక్కుతోచని స్థితిలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయని గోదావరిఖని ప్రాంతం కోడై కూస్తోంది.
కన్నుపడితే… కబ్జానే!
RELATED ARTICLES