రాజధానిలో వేలాదిమంది యువత ప్రదర్శన
ఉపాధి, విద్యావకాశాలు కల్పించాలని డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలోని నిరుద్యోగులు రోడ్డెక్కారు. కనీవినీ ఎరుగని రీతిలో వేలసంఖ్యలో నిరుద్యోగులు దేశ రాజధానిలో కదంతొక్కారు. దేశంలో పెరిగిన నిరుద్యోగంపై వారు నిరసన గళం వినిపించారు. ఉపాధి, విద్యావకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 50కిపైగా యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగ యువత గురువారంనాడు ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎర్రకోట నుంచి పార్లమెంటు వీధి వరకు సాగిన ఈ మార్చ్‌ఫాస్ట్‌కు అనూహ్య స్పందన లభించింది. గత ఏడాది డిసెంబరులో సమావేశమైన యువజన, విద్యార్థి సంఘాలు యంగ్ ఇండియా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి ‘యంగ్ ఇండియా అధికార్ మార్చ్’ పేరుతో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఉపాధి కల్పించడంలో మోడీ సర్కారు ఘోరంగా విఫలమైందని వారువ ఇమర్శించారు. ‘రోహిత్ చట్టాన్ని చేయాలి’, ‘13 పాయింట్ల రోస్టర్ విధానానికి అంతం పలకాలి’, ‘నజీబ్ ఎక్కడ?’ ‘నాలుగున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?’ వంటి నినాదాలు రాసిపెట్టి ఉన్న ప్లకార్డులు ధరించిన విద్యార్థులు ఎర్రకోట నుంచి ఎంతో రద్దీగా ఉండే దర్యాగంజ్-బారాఖంబా రోడ్ స్ట్రెచ్ మీదుగా పార్లమెంటు స్ట్రీట్‌కు చేరుకున్నారు. వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. కాకపోతే ఈ ప్రదర్శన ఎంతో ప్రశాంతంగా సాగింది. దేశంలోని దాదాపు యూనివర్శిటీలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తూ విద్యార్థులు ఈ మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొనడం విశేషం. అంబేద్కర్ యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీ, అలహాబాద్ యూనివర్శిటీ, హైదరాబాద్ యూనివర్శిటీ వంటి ప్రధాన విశ్వవిద్యాలయాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం మరో విశేషం. ఈ ప్రదర్శనకు అనుమతి లేదని, అయితే ప్రదర్శనకు అనుమతించకపోతే హింస తలెత్తే ప్రమాదం వుందని ఒప్పుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అయినప్పటికీ 11 కంపెనీలకు చెందిన పోలీసు బలగాలు ఈ ప్రాంతంలో మోహరించాయి. జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు కన్హయ్యకుమార్‌తోపాటు డిఎంకె ఎంపీ కనిమొళి, సమాజ్‌వాది పార్టీ ఎంపీ ధర్మేంద్రయాదవ్, గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మేవానీ, ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్‌ఎ) జాతీయ అధ్యక్షులు సుచితాడే తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా కన్హయ్యకుమార్ వేదికపైకి రాగానే హర్షధ్వానాలు మార్మోగాయి.
కదంతొక్కిన నిరుద్యోగులు
RELATED ARTICLES