ప్రజాపక్షం/ సూర్యాపేట బ్యూరో : కందిపంట సాగు చేసినట్లు రైతులను గుర్తించి వారి పేర్లతో వ్యవసాయ అధికారులు అందజేసిన జాబితాలో కందులు విక్రయానికి తెచ్చిన రైతుల పేర్లు లేవం టూ మార్కెట్ అధికారులు కొనుగోళ్లకు నిరాకరించడంతో మంగళవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆం దోళనకు దిగారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో చివ్వెంల పిఎసిఎస్ వారు మార్క్ ఫెడ్ ద్వారా కందుల కొనుగోలు కేంద్రాన్ని గత వారం రోజుల క్రితం ప్రారంభించారు. రైతులు దళారులను అశ్రయించడకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కుతుందని ఎంతో ఆశతో పండించిన పంటను తీసుకొని మార్కెట్‌కు తరలివచ్చారు. కానీ అక్కడి అధికారులు మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు కందుసాగు చేసిన రైతుల ఆన్‌లైన్ వివరాల ప్రకారమే కొనుగోలు చేయాలని ఆదేశించడంతో ఆ జాబితా ప్రకారమే రైతుల నుండి కందులను కొనుగోలు చేస్తున్నారు. సోమవారం మార్కెట్‌కు 58 మంది రైతులు దాదాపు 300 క్వింటాల మేరకు కందులను విక్రయానికి తీసుకురావా, వ్యవసాయ శాఖ అధికారులు అందించిన జాబితాలో కేవలం 15 మంది రైతుల పేర్లు మాత్రమే నమోదు కావడంతో వారివే కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. జాబితాలో పేర్లు నమోదై ఉన్న రైతుల కందుల కూడా తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు జరపలేదు. మంగళవారం కూడా 80 మంది రైతులు 400 క్వింటాల మేరకు కందులను మార్కెట్‌కు విక్రయానికి తీసుకొచ్చారు. వ్యవసాయ అధికారులు ఇచ్చిన జాబితా ప్రకారం కేవలం 30 మంది రైతుల పేర్లు మాత్రమే ఉన్నాయి. వారివే కొనుగోలు చేస్తామని సహకార సంఘం అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. తమ కందులను కొనుగోలు చేయాల్సిందేనంటూ మార్కెట్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. మార్కెట్ అధికారులు తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు. పిఎసిఎస్ అధికారులు కూడా తాము చేసేదేమీ లేదని తేల్చి చెప్పడంతో తమ ఆందోళనను ఉధృతం చేశారు. కలెక్టర్‌ను నేరుగా కలుసుకొని తాడోపేడో తేల్చుకుంటామంటూ రైతులు కలెక్టరేట్‌కు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రైతుల ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న మార్క్‌ఫెడ్ డిఎం సునీత, జెడిఎ విజయ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారిణి జ్యోతిర్మయి అక్కడికి చేరుకున్నారు. రైతులకు నచ్చజేప్పే ప్రయత్నం చేసినా వారు శాంతిచలేదు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాలని తాము ఏమి చేసేంది లేదంటూ వారు కూడా తెల్చి చెప్పారు. అధికారులు చెప్పిన మాటలకు తీవ్ర నిరాశకు గురయ్యారు.
కంది రైతుల ఆందోళన
RELATED ARTICLES