కాల్పుల విరమణపై మధ్యవర్తుల ఆశలు ఇజ్రాయెల్, హమాస్ పరస్పర ఆరోపణలు
దోహ/ జెరుసలేం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం మొత్తం మధ్యప్రాచ్యాన్ని అస్థిరత్వానికి గురి చేస్తున్నది. ఒకవైపు కాల్పుల విరమణకు చర్చలు జరుగుతుండగా, మరోవైపు బహుముఖ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. అమెరికా నేతృత్వంలో రెండు రోజుల శాంతి చర్చలు ముగిసినప్పటికీ, ఎలాంటి అవగాహన కుదరలేదు. దీనితో, వచ్చేవారం కైరోలో సమావేశం కావాలని తీర్మానించారు. బ్రిటిష్, ఫ్రెంచ్ విదేశాంగ శాఖ మంత్రులు డేవిడ్ లామీ, స్టెఫెన్ సెజొర్న్ జెరుసలేం పర్యటనలో ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహును లామీ సోమవారం కలవనున్నారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ముగింపు పలకాలన్న ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు తాజా దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కనీసం ఆరుగురు మృతి చెందారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) ప్రకటనను అనుసరించి, ఆయిటరొగ్ ప్రాంతంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దళం చేసిన దాడుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా లెబనాన్‌లోని, ఇరాన్ మద్దతుగల హెజ్బుల్లా దళాలు కనీసం 55 ర్యాకెట్లను ప్రయోగించాయి. వాది అల్ కఫొర్, అయెలెట్ హషహర్ ప్రాంతాల్లో దాడులను కొనసాగించినట్టు హెజ్బుల్లా ప్రకటించింది. లెబనాన్‌లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నదని ఆరోపించిన హెజ్బుల్లా, ఇందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. హెజ్బుల్లా దళాలకు ఇరాన్ మద్దతునిస్తుండగా, ఈజిప్టు అండగా నిలుస్తున్నది. దీనితో మధ్యప్రాచ్యంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దళాలు దాడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో, శాంతి చర్చల వల్ల ప్రయోజనం ఏముంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాల్పుల విరమణకు మార్గాలు ఏర్పడ్డాయని అన్నారు. మరింత విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, ఇరువర్గాల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని చర్చలు కొనసాగించాల్సి ఉందని చెప్పారు. కాగా, బైడెన్ శాంతి ప్రస్తావనలో చేసిన కొన్ని అంశాలపై హమాస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గాజా స్ట్రిప్‌లో, ఈజిప్టు సరిహద్దున ఇజ్రాయెల్ బలహాలు మోహరించి ఉంటాయని, చొరబాట్లను నివారించడానికి ఇది అనివార్యమని ఒక ప్రతిపాదన. హమాస్ దాడులకు పాల్పడకుండా నిరోధించడానికి వీలుగా గాజాలో తమ సైన్యం స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అంగీకరించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ ప్రతిపాదనను హమాస్ అంగీకరించడం లేదు. కాగా, హమాస్ కొత్తకొత్త డిమాండ్ చేస్తున్నదని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది. ఒక నిర్దిష్టమైన ఒప్పందానికి కట్టుబడకుండా, రోజుకో రకమైన డిమాండ్లను తెరపైకి తీసుకువస్తున్నదంటూ హమాస్‌పై మండిపడుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇరు వర్గాలు రాజీకి అంగీకరిస్తాయా? అన్నది అనుమానంగానే ఉంది. అంతేగాక, ఇజ్రాయెల్ తన దాడులను ఆపడం లేదు. గాజాతోపాటు, లెబనాన్‌ను కూడా లక్ష్యంగా చేసుకొని తాజా దాడులు కొనసాగిస్తున్నది. తాత్కాలిక కాల్పుల విరమణను కూడా పాటించకుండా శాంతి చర్చలకు సహకరిస్తామని ఇజ్రాయెల్ చేస్తున్న ప్రకటనలు నమ్మశక్యంగా లేవు. మొత్తం మీద మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ఆవరించాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్, దానికి మద్దతిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలు ఒకవైపు, లెబనాన్, ఇరాన్, ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలు మరోవైపు పూర్తిస్థాయి యుద్ధానికి ఉపక్రమించవచ్చు. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు రంగంలోకి దిగి, ఇరు పక్షాల మధ్య సయోధ్యకు కృషి చేస్తే తప్ప, అక్కడ శాంతి నెలకొనే అవకాశం లేదు.
ఓ వైపు చర్చలు..మరో వైపు దాడులు..
RELATED ARTICLES