నేటి సాయంత్రంతో ప్రచారం బంద్
ప్రజాపక్షం/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచార అంకం మంగళ వారం సాయంత్రం 5 గంటలతో ముగియనుందని రాష్ట్ర ప్రధాన ఎన్ని కల అధికారి రజత్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియా, లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుని కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వా రిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చర్యలు తీసుకుంటాయని విశ్వసిస్తున్నామన్నారు. ఇప్పటికే 11న సెలవు దినంగా కూడా ప్రకటించామన్నారు. హైదరాబాద్లో ఐటి, ఫార్మా సంస్థల్లో భారీగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని, ఓటు హక్కు వినియోగించుకునేలా ఆ రోజున సెలవు ఇవ్వక పోతే ఆయా కంపెనీలపై ఎన్నికల కమిషన్ చట్టాల ప్రకారం చర్యలు తప్పవని రజత్ కుమార్ హెచ్చరించారు. ఓటర్లు గుర్తింపు కార్డు కింద ఓటరు స్లిప్పు చెల్లదని ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. అయితే ఓటరు ఐడి కార్డు ( ఎపిక్ కార్డు)ను గుర్తింపు నిర్ధారణకు చూపవచ్చన్నారు. ఒక వేళ ఓటర్ ఐడి కార్డు లేని పక్షంలో ఫోటోతో కూడిన డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, డ్రైవింగ్ లెసెన్సు, బ్యాంకు పాస్ బుక్, ఆధార్ కార్డు తదితర 11 కార్డులను చూపించవచ్చన్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటు మాత్రమే వేసి రావాలని, ఈవిఎంల వద్ద సెల్పీలు దిగి ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే కేసులు నమోదు చేసి ( లోపలేయిస్తాం) జైలుకు పంపుతామని సిఇఓ రజత్ కుమార్ హెచ్చరించారు. ఓటు వేసినట్లు మిత్రులకు తెలియజేయాలని భావించే వారు ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం బయట ఫోటోలు దిగితే తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రగతి భవన్లో చేరికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామని, వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు.