వికారాబాద్ జిల్లా మల్లారెడ్డిగూడలో టిఆర్‌ఎస్ సర్పంచ్ దౌర్జన్యం
ఎన్నికల సమయంలో ఓటు వేయలేదని జెసిబి వాహనంతో ఇంటిని కూల్చేందుకు యత్నం
కలెక్టర్ న్యాయం చేయకపోతే మరణమే శరణ్యమంటున్న బాధితుడు శామయ్య
వికారాబాద్ : గ్రామాలలో ఇంకా ఎన్నికల రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయి. ఎన్నికలలో తమతోపాటు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులపై గెలిచిన ప్రజాప్రతినిధులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం మల్లారెడ్డిగూడ గ్రామంలో సర్పంచ్‌గా గెలుపొందిన శేఖర్ అదే గ్రామానికి చెందిన సంకెపల్లి శామయ్యపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శేఖర్, సంకెపల్లి శామయ్య అన్న కుమారుడు మల్లేశం సర్పంచ్ స్థానానికి పోటీ చేశారు. కాగా, శేఖర్ మల్లేశంపై సర్పంచ్‌గా గెలుపొందారు. అప్పటి నుంచి మల్లేశం, శామయ్య కుటుంబ సభ్యులపై శేఖర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. శామయ్య గ్రామ కంఠం స్థలంలో హనుమాన్ మందిరం ముందు ఇంటి నిర్మాణం చేసుకున్నాడు. మల్లేశం నిర్మించుకున్న ఇంటికి అనుమతి లేదని, అధికారులతో మాట్లాడి ఇంటిని కూలుస్తామని శేఖర్ పలుమార్లు శామయ్యను బెదిరింపులకు గురిచేశాడు. ఈ విషయమై గ్రామంలో పలుమార్లు పంచాయతీ కూడా జరిగింది. పంచాయతీలో ఐదుగురు వార్డు సభ్యులు మద్దతు పలుకగా, మరి కొందరు వార్డు సభ్యులు,సర్పంచ్ కలిసి ఎన్నికల సమయంలో తమకు సాయం చేయలేదనే రాజకీయ కక్షతో ఇంటి నిర్మాణం కూల్చి వేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నాలుగు నెలల కిందట గ్రామ పెద్దల సమక్షంలో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇళ్లు పూర్తి అయిన తదనంతరం కూలుస్తామని బెదిరిస్తున్నాడు. ప్రస్తుతం గ్రామంలో కొనసాగుతున్న 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠం లో ఇంటి నిర్మాణం చేశావని, నీ ఇల్లు కూలుస్తామని, ఇంటి ముందు మోడల్ బస్టాండ్ నిర్మిస్తానని జెసిబి వాహనం తీసుకువచ్చారు. చేసేదేమీ లేక శామయ్య భార్య జెసిబి వాహనానికి అడ్డుగా కూర్చుంది. తనను చంపిన తరువాత ఇంటిని కూల్చాలని మొండికేసింది.మల్లారెడ్డిగూడ గ్రామకంఠంలో మొత్తం 11 ఎకరాల స్థలం ఉన్నదని, 11ఎకరాలలో ఎంతో మంది ఇళ్ల నిర్మా ణం చేసుకున్నారని, వారి ఇళ్లను ఎందుకు కూల్చడం లేదని వాపోయారు.
కలెక్టర్ కార్యాలయం ముందు క్రిమిసంహారక మందు తాగి చనిపోతా : బాధితుడు శామయ్య
గ్రామ కంఠంలో తాను అందరి మాదిరిగా ఇంటి నిర్మాణం చేసుకున్నానని బాధితుడు శామయ్య తెలిపారు. అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టావని, నీ ఇల్లు జెసిబి వాహనంతో కూలగొట్టి ఇంటి ముందు మోడల్ బస్టాండ్ నిర్మాణం చేపడుతామని సర్పంచ్ శేఖర్ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఓటు వేయలేదని మనసులో కక్ష పెంచుకున్న శేఖర్ తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. తనకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు క్రిమిసంహారక మందు తాగి చనిపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శి కూడా ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.
ఓటు వేయలేదని.. ఇంటిని కూల్చాలని!
RELATED ARTICLES