న్యూఢిల్లీ : మరో రెండు మూడు మాసాల్లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం శుక్రవారంనాడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తొలిసారి చేసిన తన సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో ఇది తాత్కాలిక బడ్జెట్ కాదని, దేశ అభివృద్ధి మార్పిడికి ఒక చోదకశక్తి అని అభివర్ణించారు. రైతులు, మధ్యతరగతి వర్గాలు ముఖ్యంగా వేతన జీవులను లక్ష్యంగా చేసుకొని బడ్జెట్‌ను తయారు చేశారు. సన్న, చిన్నకారు రైతులకు యేటా రూ. 6,000 నగదు, అలాగే రూ. 5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు, టిడిఎస్ పరిమితి పెంపు, అసంఘటిత రంగ కార్మికులకు నెలసరి రూ. 3,000 పింఛను వంటి లక్షణాలు పక్కా ఎన్నికల ప్రణాళికను ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని గోయల్ చెప్పారు. అయితే ఇది కేవలం ఎన్నికల కోసం రెండు మాసాల బడ్జెట్ అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. అందుకే బలమైన ఓటుబ్యాంకు కలిగివున్న వర్గాలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా 3 కోట్ల మంది వేతనజీవులు, పింఛనుదారులు, స్వయం ఉపాధి, చిన్న పరిశ్రమలు నడుపుకునే వారు, వారిపై ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగులు, అలాగే కార్మికులకు సంబంధించిన అంశాలకే ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చారు. తొలుత 2019- కేంద్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, 2022 నాటికి నవ భారత నిర్మాణం దిశగా ప్రయాణం చేస్తున్నామని, వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపునకు కట్టుబడి ఉన్నామని, ఆర్థిక అస్థిరత తిరోగమనానికి పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత శీఘ్రంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని, గతం కన్నా గడిచిన ఐదేళ్లలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) పెరిగిందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో ఆకర్షణీయమైన ప్రదేశంగా భారత్‌కు గుర్తింపు పొందిందన్నారు.
ఓటు!.. ఆన్ అకౌంటు
RELATED ARTICLES