చైనా నుంచి ఉత్పన్నమవుతున్నట్లుగా గుర్తించిన శాస్త్రవేత్తలు
వాషింగ్టన్ : ఓజోన్ పొర మన భూమండలానికి చాలా ముఖ్యమైనది. సూర్యుని తీవ్ర కిరణాలను భూమిపై నేరుగా పడకుండా కాపాడే ఓజోన్ పొర వల్ల భూమిపై యావత్ జీవజాలానికి రక్షణ ఏర్పడుతోంది. అయితే కాలుష్యం, గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలు, గ్లోబల్ వార్మింగ్ వంటి కారణాల వల్ల ఓజోన్ పొరకు చిల్లులు పడుతున్నాయి. దీంతో ముప్పు పొంచివుందని ఇప్పటికే పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని శతాబ్దాలకు భూమిపై జీవజాలం రూపురేఖలు మారిపోయే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఓజోన్ పొరను చీలుస్తున్న రహస్య విషవాయువు ఏమైవుంటుందా? అని శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. చివరకు ఇప్పటివరకు అంతుచిక్కని ఓజోన్ను నాశనం చేస్తున్న ఆ విషవాయువును కనిపెట్టారు. ఈ విషవాయువు చైనా నుంచి ఉత్పన్నమవుతున్నట్లు సాక్ష్యం లభించిందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పర్యావరణ శాస్త్రవేత్తలకు ఈ మిస్టరీ ఉద్గారాలు పెద్ద సమస్యగా మారాయి. వాస్తవానికి 2010లోనే ఓజోన్ను నాశనం చేసే ఈ ఉద్గారాలను ఉపయోగించకుండా ప్రపంచ దేశాలు నిషేధించాయి. అయినప్పటికీ, ప్రపంచంలో ఎక్కడో ఈ విషవాయువులు ఉత్పన్నమవుతూనే వున్నాయి. అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుక్కూర్చున్నారు. ఒక దశలో ఈ ఉద్గారాలు భారత్ నుంచి ఉత్పన్నమవుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. కానీ భారత్ నుంచి కాదని కొన్నాళ్లకు తెలిసింది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు తమ అన్వేషణ వివిధ కోణాల నుంచి చేసిన తర్వాత ఈ విషవాయువులు చైనా నుంచి వస్తున్నాయని ఎట్టకేలకు గుర్తించారు. అయితే చైనాపై ఆరోపణలు చేసే అది రాజకీయంగా అమెరికా శాస్త్రవేత్తలు చేసిన ఆరోపణగా వివాదాస్పదమవుతుందని భావించి, తమ ఆరోపణలను రుజువులతో సహా నిరూపించారు. అయితే దీనిపై చైనా ఇంకా స్పందించాల్సివుంది. ఈ ఆరోపనలకు సంబంధించిన కథనాన్ని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. చైనా వైపు వేలెత్తి చూపడంలో అర్థం వుందని, అందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు తమ వద్ద వున్నాయని తేల్చిచెప్పారు. ప్రస్తుతం చైనాలోని తూర్పు ప్రాంతం నుంచి ప్రతియేటా కనీసం 20 వేల టన్నుల కార్బన్ టెట్రాక్లోరైడ్ విషవాయువులు వెలువడుతున్నాయని, చైనాకు సమీపంలోని కొరియా ద్వీపకల్పం నుంచి ఎయిర్‌బోర్న్ అట్మాస్ఫియరిక్ కాన్సెంట్రేషన్ డేటా ఆధారంగా ఈ వివరాలు వెల్లడించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా జరిపిన ఈ అధ్యయన పత్రం జర్నల్ జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమైంది.
ఓజోన్ను దెబ్బతీసే విషవాయువులివే!
RELATED ARTICLES