న్యూఢిల్లీ : భారత స్టార్ రెజ్లర్, ఒలింపియన్ సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీస్‌లు ఆదివారం అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను సుమారు రెండు వా రాలుగా తప్పించుకొని తిరుగుతున్న విష యం తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు కూడా పోలీస్‌లు ప్రకటించారు. జూనియర్ రెజ్లర్ సాగర్ రాణాపై దాడి చేయడంతో అత ను మృతి చెందాడని సుశీల్ కుమార్‌పై పోలీస్‌లు అంతకు ముందే కేసు నమోదు చేశారు. ఈనెలలో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా చనిపోయాడు. సాగర్ పై దాడి చేసిన వారిలో రెజ్లర్ సుశీల్ ఉన్నట్లు సిసి ఫుటేజ్‌ల్లో స్పష్టంగా ఉందని అంటున్నారు. కాగా, సాగర్ చనిపోయినప్పటి నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. అతనిపై పోలీస్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎనిమిది పోలీస్ బృందాలు గాలింపులు చర్యలు చేపట్టాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ టోల్ ప్లాజా మీదుగా కారులో వెళుతున్నట్లు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఇతని ఫొటోలు వైరల్ అయ్యాయి. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీస్‌లు ఎట్టకేలకు అతనిని, అజయ్ కుమార్ అనే మరో వ్యక్తిని ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
కెరీర్‌కు తెర?
ఒలింపిక్‌లో భారత్‌కు రెండు వ్యక్తిగత పతాలు సాధించిన ఏకైక స్పోర్ట్‌పర్సన్‌గా రికార్డు సృష్టించిన రెజ్లర్ సుశీల్ కెరీర్‌కు తెరపడే ప్రమాదం కనిపిస్తున్నది. ఎంతోమంది యువకులు కుస్తీ పట్ల మక్కువ చూపేందుకు అతనే మార్గదర్శకుడు. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సుశీల్ ఇప్పుడు తన శిష్యుడినే హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కోవడం దురదృష్టకరం. సాగర్ రాణాపై దాడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… సుశీల్‌కు ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో ఉన్న ఇంట్లో రెజ్లర్ సాగర్ కుమార్ రాణా కొన్నాళ్లు అద్దెకు ఉన్నాడు. అతను అద్దె సరైన సమయానికి చెల్లించలేదన్న కారణంగా సుశీల్ అతనితో వివాదం ఏర్పడింది. సుశీల్ బలవంతం చేయడంతో, నాలుగు నెలల క్రితం సాగర్ రాణా ఆ ఇల్లు ఖాళీ చేశాడు. ఈ సంఘటన తర్వాత సుశీల్‌ను సాగర్ అందరి ముందూ దూషించేవాడని అంటున్నారు. ఈనెల నాలుగో తేదీ అర్ధరాత్రి ఛెత్రసాల్ స్టేడియం వద్ద ఘర్షణ జరిగింది. సుశీల్, ఆయన బృందం హాకీ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లతో తమపై దాడి చేసిందని క్షతగాత్రుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. . దాడి అనంతరం రాత్రి 2 గంటల సమయంలో సుశీల్ కుమారే పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి స్టేడియం వద్ద ఘర్షణ జరిగినట్లు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఐదుకార్లు ఆపి ఉన్నాయి. వాటిల్లో ఉన్న ఒక స్కార్పియో కారులో తూటాలు నింపి ఉన్న డబుల్ బ్యారెల్ గన్, మూడు కార్ట్రెడ్జ్లు దొరికాయి. ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలతో పడిపోయి ఉన్నారు. వారిలో సాగర్ చికిత్స పొందుతూ మరణించాడు. సుశీల్, అతని బృందం కొట్టిన దెబ్బలకే సాగర్ మృతి చెందినట్టు అతని తండ్రి ఆరోపిస్తున్నాడు. సాక్షాలు తనకు వ్యతిరేకంగా ఉండడాన్ని గమనించిన సుశీల్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. కానీ, కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది. ఘర్షణ జరిగిన రెండు వారాల తర్వాత సుశీల్ పోలీస్‌లకు చిక్కాడు. కోర్టులో ఏం తేలుతుంది? తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుంది? అనే అంశాలను పక్కకు ఉంచితే, ఏకంగా మర్డర్ కేసులో చిక్కుకున్న సుశీల్ కెరీర్ ఇబ్బందుల్లో పడిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అతను క్రీడారంగంలో మళ్లీ తన పూర్వ గౌరవాన్ని పొందడం అసాధ్యంగానే కనిపిస్తున్నది.
ఒలింపియన్, రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్టు
RELATED ARTICLES