41 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ పతకం
టోక్యో : టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 41 సంవత్సరాల తర్వాత ఈ మెగా ఈవెంట్లో ఓ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మూడో స్థానం కోసం గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 5 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించింది. ఒకప్పుడు ఎనిమిది పర్యాయాలు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలను గెల్చుకున్న చేసుకున్న భారత్ చివరిసారి 1980 మాస్కో గేమ్స్‌లో స్వర్ణాన్ని అందుకుంది. ఆతర్వాత క్రమంగా భారత హాకీ ప్రభావం క్షీణించింది. ఒకానొక దశలో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడమే ఒక అద్భుతం అనుకునే పరిస్థితి నెలకొంది. కానీ, ఇటీవల కాలంలో మళ్లీ తనదైన శైలిలో రాణిస్తున్న హాకీ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్‌లో జర్మనీపై చివరి క్షణం వరకూ పోరాడి గెలిచింది. మ్యాచ్ రెండో నిమిషంలోనే జర్మనీ ఆటగాడు తైమూర్ ఒరుజ్ గోల్ చేయగా, భారత్ ఎదురుదాడికి దిగింది. 17వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్ ద్వారా ఈక్వెలైజర్‌ను సంపాదించింది. అయితే, జర్మనీ ఆటగాళ్లు దాడులను కొనసాగిస్తూ, నిమిషం వ్యవధిలో రెండు గోల్స్ సాధించి, తమ జట్టును ఆధిక్యంలో నిలబెట్టారు. 24వ నిమిషంలో నిక్లాస్ వెలెన్, 25వ నిమిషంలో బెనెడిట ఫర్క్ జర్మనీకి గోల్స్‌ను సాధించిపెట్టారు. దీనితో 3 సంపాదించిన జర్మనీ విజయం ఖాయంగా కనిపించింది. కానీ, తీవ్రమైన ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్న భారత ఆటగాళ్లు గోల్స్ కోసం విశేషంగా శ్రమించారు. 27 నిమిషంలో హార్దిక్ సింగ్, 29వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ సాధించారు. దీనితో ఇరు జట్లు చెరి మూడు గోల్స్‌తో సమవుజ్జీగా నిలిచాయి. 31వ నిమిషంలో రూపీందర్ పాల్ ద్వారా గోల్ లభించడంతో భారత్ 4 ఆధిక్యానికి దూసుకెళ్లింది. తొలి గోల్ చేసిన సిమ్రన్‌జిత్ సింగ్ 34వ నిమిషంలో చక్కటి ఫీల్డ్‌గోల్‌తో రాణించి, భారత్‌కు 5 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. అనంతరం భారత్ రక్షణాత్మక విధానాన్ని అనుసరించిది. గోల్స్ కోసం శ్రమించిన జర్మనీకి 48వ నిమిషంలో లుకాస్ విండ్‌ఫెడర్ నుంచి గోల్ లభించింది. కానీ, ఆపైన అదే దూకుడును కొనసాగించలేకపోయింది. ఫలితంగా భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసి, కాంస్య పతకాన్ని సాధించింది.
ప్రముఖుల ప్రశంసలు
టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇది ఒక కొత్త చరిత్రకు శ్రీకారమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. అద్భుత ప్రతిభకను కనబరచిన హాకీ జట్టు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
పన్నెండవది..
భారత్‌కు ఒలింపిక్స్ పురుషుల హాకీలో ఇది 12వ పతకం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొమ్మిదవది. 1928 ఆమ్స్టర్డామ్, 1932 లాస్ఏంజిలిస్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు స్వర్ణ పతకాలు లభించాయి. అప్పట్లో భారత జట్టు ‘బ్రిటిష్ ఇండియా’ పేరుతో పోటీపడింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948 లండన్, 1952 హెల్సిన్కీ, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణాలను అందుకుంది. వరుసగా ఆరు పర్యాయాలు విజేతగా నిలిచిన భారత్ 196-0 ఒలింపిక్స్‌లో రజత పతకానికి పరిమితమైంది. 1964లో టోక్యోలోనే జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. 1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లోనూ కాంస్యంతో సరిపుచ్చుకుంది. అయితే, కేవలం ఆరు జట్లు మాత్రమే పోటీపడిన 1980 మాస్కో ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచి, స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. 41 సంవత్సరాల విరామం తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి కాంస్య పతకాన్ని అందుకుంది.