‘మన్‌కీబాత్’లో మోడీ వెల్లడి
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్‌పై జరిపే యుద్ధంలో వ్యక్తిగత అప్రమత్తత,క్రమశిక్షణే దేశానికి అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆకాశవాణి, దూరదర్శన్లకుఇచ్చే ఆదివారంనాటి నెలవారీ సంచిక ‘మన్‌కీ బాత్’ ప్రసంగంలో కరోనా కొత్త వేరియంట్‌ను ప్రతిఘటించడంలో వ్యక్తిగత చైతన్యమే దేశానికి అతిపెద్ద బలమన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే, టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్ అసాధారణమైన, అనూహ్యమైన ఫలితాలను సాధించిందని ఆయన అన్నారు. అయినప్పటికీ కూడా దేశంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. 2022వ సంవత్సరం ఆధునిక భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేజీగా ఉండాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. జనవరి 3వ తేదీ నుండి 15 మధ్య వయసుగల పిల్లలకు టీకా పంపిణీ ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రధానమంత్రి ప్రకటించారు. అదేవిధంగా ఆరోగ్య కార్యకర్తలకు, అగ్రభాగాన నిలబడి కరోనాతో పోరాటం చేసే ఇతర రంగాల కార్యకర్తలకు ముందస్తు జాగ్రత్తగా జనవరి 10న మరో డోసు టీకా వేస్తామన్నారు. 60 ఏళ్ళు వయసు దాటిన పౌరులకు ప్రికాషనరీ టీకా డోసులు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలియజేశారు. దేశంలో వైద్య శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలను, దారి తీరు తెన్నులను కనిపెట్టి ఉంటున్నారని, దాని కదలికలను పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రతి రోజూ శాస్త్రవేత్తలు కొత్త కొత్త సమాచారాన్ని సంపాదిస్తున్నారని, ఆ సమాచారానికి అనుగుణంగా ఇచ్చే సలహాలతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో ప్రతి వ్యక్తీ అప్రమత్తంగా ఉండాలని, కరోనా కట్టడిలో వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాలని కోరారు. గడచిన రెండు సంవత్సరాలలో దేశం కరోనా విషయంలో ఎంతో అనుభవం సంపాదించిందని, అందువల్ల ఈ ప్రపంచ మహమ్మారి కరోనాను ఓడించడంలో ప్రజల స్వయం కృషే అన్నింటికంటే ముఖ్యమని అన్నారు. మనం సమష్టి బాధ్యతతో ఒమిక్రాన్‌ను ఓడించగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం ఈ విధమైన వ్యక్తిగత చైతన్యం, అప్రమత్తతా బాధ్యతతోనే 2022 కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పటి వరకూ దేశంలో 140 కోట్ల డోసుల టీకా పంపిణీ చేశామని, ఈ విధంగా ప్రతి ఒక్కరూ టీకా వేయించుకున్నారని, ఇది మన సంకల్పాన్ని, మన శాస్త్రవేత్తల సంకల్పాన్ని సమష్టితత్వాన్ని చాటి చెబుతోందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా 8వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత రక్షణ బలగాల మొట్టమొదటి ప్రధానాధికారి బిపిన్ రావత్, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శౌర్యచక్ర అవార్డు గ్రహీత వరుణ్ సింగ్‌లకు, మిగిలిన 12 మందికీ నివాళులు అర్పించారు. వరుణ్ సింగ్ తీవ్ర గాయాలతో ఉండి కూడా ఎంతో మనో విశ్వాసంతో కడవరకూ మృత్యువుతో పోరాటం చేశారని చెబుతూ, గడచిన ఆగస్టులో ఆయనను దేశం శౌర్యచక్ర అవార్డుతో సత్కరించిందని గుర్తు చేస్తూ, తన స్కూలు ప్రిన్సిపాల్‌కు అవార్డు పొందిన అనంతరం రాసిన లేఖను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, జాతి, యువతరం, విద్యార్థులు ఆయన నుండి స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. పాఠశాలలో తక్కువ మార్కులు వచ్చాయని ఏ విద్యార్థీ కలత చెందకూడదని, జీవితంలో వరుణ్ సింగ్ తరహాలోనే ఉన్నత స్థితికి ఎదిగేందుకు ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప అవకాశం వస్తుందన్నారు. ప్రతి సంవత్సరం ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రతి విద్యార్థితో మాట్లాడేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం విద్యార్థులు Mygov.in. లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. దేశంలో పుస్తకాలు చదివే అలవాటును ఆయన ప్రశంసిస్తూ, ఈ ఏడాదిలో తనకు ఇష్టమైన ఐదు పుస్తకాలను శ్రోతలకు ఆయన వివరించారు. తెరపై చిత్రాలు చూడడం బాగా పెరిగిన దశలో పుస్తక పఠనం కూడా అంత కంటే బాగా మరింత..మరింత ఎక్కువగా ఉండాలని ఆయన అన్నారు. ప్రపంచంలో ఇంటర్నెర్ బాగా వృద్ధి చెందిందని, దీని ద్వారా భారత సంస్కృతిని ప్రపంచ దేశాలు ఎక్కువగా తెలుసుకుంటున్నాయని చెబుతూ, సైబీరియన్ స్కాలర్ డా.మోమిర్ నికిచ్ రూపొందించిన ద్విభాషా సంస్కృత నిఘంటువును ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. అదేవిధంగా మంగోలియాకు చెందిన 93 ఏళ్ళ వయసుగల ప్రొఫెసర్ జె.జెనెధారమ్ గడచిన నాలుగు దశాబ్దాలలో 40కి నూగా పురాతనాంశాలను, ఇతిహాసాలను భారతీయ భాషల నుండి మంగోలియా భాషలోకి అనువదించారని గుర్తు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఎయిర్ గన్ల స్వాధీనం కార్యక్రమాన్ని ప్రశంసించారు. పక్షలను ఇష్టం వచ్చినట్టు వేటాడే సంప్రదాయాన్ని వదిలేసి ప్రకృతిని జీవవైవిధ్యాన్ని కాపాడాలనుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. దేశాన్ని అని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని, అందుకు తగిన వనరులను అన్నింటినీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మోడీ కోరారు.
ఒమిక్రాన్‌పై యుద్ధంలో వ్యక్తిగత క్రమశిక్షణే దేశానికి పెద్ద బలం
RELATED ARTICLES