ఎస్‌సిఓ సదస్సులో నేడు పుతిన్ తదితరులతో మోడీ భేటీ!
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంఘం (ఎస్‌సిఒ) సదస్సు శిఖరాగ్ర సమావేశాలు గురువారం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రష్యా, చైనా అధ్యక్షులు వ్లదిమీర్ పుతిన్, జీ జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశంలో ‘ఒన్ చైనా’ విధానాన్ని పుతిన్ సమర్థించారు. కాగా, ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఎస్‌సిఓ రెండోరోజు సమావేశాల్లో పాల్గొంటారు. రష్యా,ఉజ్బెకిస్థాన్ దేశాల అధ్యక్షులు పుతిన్, షవ్‌కత్ మిర్జియేయెవ్ తదితర నాయకులతో మోడీ విడివిడిగా సమావేశాలు జరిపే అవకాశాలున్నాయని భావిస్తున్నా రు. అయితే జిన్‌పింగ్‌తో మోడీ సమావేశాన్ని చైనా విదేశాంగశాఖ ధృవీకరించలేదు. ఉక్రేన్‌పై రష్యా దాడి అనంతరం చైనా నాయకులు జిన్‌పింగ్ సమావేశం కావడం ఇదే మొదటిసారి. జిన్‌పింగ్ అనుసరిస్తున్న ‘ఒన్ చైనా’ విధానాన్ని పుతిన్ ఈ ముఖాముఖీ సమావేశంలో సమర్థించారు. తైవాన్ విషయంలో అమెరికా, దాని తైనాతీ దేశాలు అనుసరిస్తున్న రెచ్చగొట్టే విధానాలను కూడా ఈ సమావేశంలో పుతిన్ తీవ్రంగా ఖండించారు. కాగా జిన్ పింగ్‌కూడా పుతిన్‌తో హృదయపూర్వకంగా చర్చలు జరిపారు. రెండు దేశాలకు మేలు చేసే కీలకమైన రంగాలలో రష్యాతో కలిసి పనిచేయడనికి, రష్యాకు పూర్తి మద్దతు ఇవ్వడానికి తాము సుముఖంగా ఉన్నామని పుతిన్‌కు జిన్‌పింగ్ చెప్పారు. రెండు దేశాలకు పరస్పరం ప్రయోజనం చేకూర్చే జాతీయ అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ద్వైపాక్షిక అంశాలపై కలిసి పనిచేసేందుకకు సిద్దంగా ఉన్నట్లు జిన్‌పింగ్ చెప్పారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం ఎస్‌సిఓ సమావేశంలో ప్రాంతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళుతోపాటు ఎస్‌పిఓ సభ్యదేశాలమధ్య వాణిజ్యాభివృద్ధి, ఇంధన సరఫరాలు వంటి ఇతర అనేక అంశాలను ప్రస్తావిస్తారు. మోడీ ఈ సమావేశంలో పాల్గొనడంద్వారా ఎస్‌సిఓ సదస్సుతోను, దాని లక్ష్యాలతోనూ భారత్‌కు అనుబంధాన్ని, ప్రాధాన్యాన్ని ప్రతిబింబించడమే కీలకమైన విషయమని విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ క్వత్రా చెప్పారు. ఎస్‌సిఓలో ఎనిమిది దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అంతర్జాతీయ అంశాలపై కూడా ఈ సదస్సులో చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా సభ్యదేశాల ఆర్థిక,వాణిజ్య సంబంధాల పటిష్టత, ప్రాంతీయ భద్రతపై ఈ సదస్సు దృష్టి కేంద్రీకరిస్తుంది. 24 గంటలపాటు నరేంద్రమోడీ సమర్‌ఖండ్‌లో గడుపుతారు. ఈ సమయంలో పలు దేశాల అధినేతలతో ముఖాముఖీ చర్చలు చేస్తారు. వ్లదిమీర్ పుతిన్‌తోపాటు ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీలతో కూడా ఆయన సమావేశాలు జరుగుతాయి. దేశాలమధ్య పరస్పర సహకార సాధనకు తాను కృషి చేస్తానని మోడీ ఈ సందర్భంగా అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద మూకలకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ప్రాంతీయ భద్రత ఎలా చెల్లుబాటు అవుతుందని అడిగిన ప్రశ్నకు వినయ్ కత్రా సమాధానమిస్తూ, ఉగ్రవాదం సవాలు ఎదుర్కోవడానికి విభిన్న మార్గాలు ఉన్నాయని,ప్రాంతీయ సహకారంపై భారత్ దృష్టిసారిస్తుందన్నారు. చరిత్రలో ఎస్‌సిఓ చట్రంలోనే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి చర్చలతో మార్గాలు అనుసరించామన్నారు. ఏదో ఒకదేశం అంశం సమస్యగా ఉండదన్నారు.
‘ఒన్ చైనా’ విధానానికి రష్యా మద్దతు
RELATED ARTICLES