HomeNewsBreaking Newsఒడిశా రైలు ప్రమాదంపైవిచారణకు సిబిఐ సిద్ధం

ఒడిశా రైలు ప్రమాదంపైవిచారణకు సిబిఐ సిద్ధం

న్యూఢిల్లీ: అధికారిక లెక్కల ప్రకారం 288 మంది మృతికి కారణమైన ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి సిబిఐ సిద్ధంగా ఉంది. సుమారు 1,100 మంది గాయపడిన బాలాసోర్‌ రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పిటిఐ సమాచారం ప్రకారం… దర్యాప్తు విధానానికి అనుగుణంగా, ఒడిశాలో రెండు ప్యాసింజర్‌ రైళ్లు, ఒక గూడ్స్‌ రైలుతో ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత, అంటే, జూన్‌ 3న ఒడిశా పోలీసులు నమోదు చేసిన బాలాసోర్‌ జిఆర్‌పి కేసు నంబర్‌ 64ని కేంద్ర ఏజెన్సీ స్వాధీనం చేసుకుంటుంది. ఐపిసి సెక్షన్లు 337, 338, 304ఎ (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), 34 (ఉద్దేశపూర్వకంగా చేసే నేరాలు), సెక్షన్లు 153 (రైల్వే ప్రయాణికుల ప్రాణాలకు హాని కలిగించే చట్టవిరుద్ధమైన, నిర్లక్ష్యపు చర్య), 154, 175 (ప్రాణాలకు ప్రమాదం)తోపాటు రైల్వే చట్టం కింద కూడా కేసు నమోదైంది. సిబిఐ దర్యాప్తునకు ఇప్పటికే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఆదేశాలు జారీ చేయగా, ఈ కేసును ఢిల్లీ హెడ్‌ క్వార్టర్స్‌లోని స్పెషల్‌ క్రైమ్‌ విభాగానికి కేటాయించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ప్రకారం, సిబిఐ స్థానిక పోలీసు ఎఫ్‌ఐఆర్‌ను తిరిగి సొంత కేసుగా పరిగణించి, ప్రత్యేక కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభిస్తుంది. విచారణ పూర్తయిన తర్వాత దాఖలు చేసిన ఛార్జ్‌ షీట్లో ఎఫ్‌ఐఆర్‌ నుండి పోలీసులు ఇప్పటికే పేర్కొన్న చార్జెస్‌కు అదనంగా ఇతరత్రా సెక్షన్లను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు. ‘విధ్వంసం‘, రైళ్ల ఉనికిని గుర్తించే ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ను ట్యాంపరింగ్‌ చేయడం వల్లే శుక్రవారం ప్రమాదానికి దారితీసిందని సంస్థాగత విచారణ చేస్తున్న రైల్వే అధికారులు అంటున్నారు. 2,500 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్ప్రెస్‌, షాలిమార్‌- చెన్నైసెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇనుప ఖనిజంతో నిండిన గూడ్స్‌ రైలు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు బాలాసోర్‌లోని బహనాగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 21 కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇలావుంటే, బాలాసోర్‌ రైలు ప్రమాదంపై సిబిఐ దర్యాప్తుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషనర్‌ (సిఆర్‌ఎస్‌) విచారణ జరుపుతున్నప్పుడు సిబిఐ విచారణ ఆవశ్యకతపై ప్రశ్నిస్తున్నాయి. దీనిపై పేరు చెప్పడానికి ఇష్టపడని రైల్వే అధికారి ఒకరు పిటిఐతో మాట్లాడుతూ, ప్రాథమిక విచారణలో మరింత సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు. ‘విచారణ సమయంలో చాలా సమాచారం వచ్చిందని, ప్రొఫెషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఎజెన్సీ దర్యాప్తు అత్యవసరమైన వివిధ రకాల సమాచారం అందుబాటులోకి వచ్చింది అని ఆయన చెప్పారు. ‘ఉద్దేశపూర్వక జోక్యం ఉంటే తప్ప, ప్రధాన లైన్‌ కోసం సెట్‌ చేయబడిన మార్గాన్ని లూప్‌ లైన్‌కు మార్చడం అసాధ్యం‘ అని అతను చెప్పాడు. డ్రైవర్‌ లోపం లేదా ఇంటర్‌లాకింగ్‌ సిసమ్‌లో లోపం లేకపోవడాన్ని మంత్రిత్వ శాఖ గతంలో తోసిపుచ్చినప్పటికీ, అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments