‘దళితబంధు’ పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న సిఎం కెసిఆర్
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శ
మంథని, భూపాల్పల్లి, సుబ్బక్కపల్లి, నల్లబెల్లి, చిలకమ్మనగర్ ప్రాంతాల్లో సాగిన పోడుయాత్ర
ప్రజా పక్షం/ జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి/ మంథని : పోడు భూములకు పట్టాలు ఇస్తానని టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారని, అలాగే ప్రభుత్వం రెండోసారి గెలవగానే తప్పకుండా రైతులకు పట్టాలు ఇస్తానని సిఎం కెసిఆర్ ప్రకటించారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క పోడు రైతుకు కూడా పట్టా ఇవ్వలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సిపిఐ పోడు యాత్రలో భాగంగా గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భూపాలపల్లి మండల సుబ్బక్క పల్లి గ్రామంలో పోడు రైతుల వ్యవసాయ భూములను చాడ వెంకట్‌రెడ్డి పరిశీలించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబంధించిన సమస్యలపై వినతులను స్వీకరించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. సిపిఐ ప్రతినిధి బృందం ఉదయం మంథని నుంచి పోడుయాత్రను ప్రారంభి భూపాల్పల్లి జిల్లా సుబ్బక్కపల్లి, వరంగల్ రూరల్ జిల్లాలోని నల్లబెల్లి, చిలకమనగర్ తదితర ప్రాంతాలలోని పోడుభమూలను సందర్శించింది. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సిపిఐ, సిపిఐ(ఎం) పార్టీల విజ్ఞప్తి మేరకు పోడుసాగుదారుల హక్కుల అంశం 2005లో అప్పటి యుపిఎ ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ (సిఎంపి)లో పొందుపర్చింనది, 2006లో చట్టం అయిన అనంతరం వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న 8 లక్షల మంది రైతులలో 3.68 లక్షల మందికి హక్కు పత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. అప్పటి నుండి పోడు చేసుకుంటున్న గిరిజనులకు ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ పట్టాలు ఇవ్వలేదన్నారు. పైగా తెలంగాణ హరితహారం పేరుతో పోడు చేసుకుంటున్న రైతులపై అటవీ శాఖ అధికారులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ, గిరిజన శాఖ సమన్వయంతో పోడు భూముల రైతు సమస్యలు పరిష్కరించాలని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఎస్సి కార్పొరేషన్ రుణాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని కెసిఆర్ మోసం చేశారని, అలాగే దళితులపై ప్రేమ ఉన్నదని, దళితబంధు ఇస్తానని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సిఎం కెసిఆర్‌కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే నేరుగా దళితులందరికీ దళితబంధు వర్తింప చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయ్ చందర్‌రెడ్డి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎన్.జ్యోతి , సిపిఐ జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, సిపిఐ కౌన్సిలర్ నూకల భూలక్ష్మి చంద్రమౌళి, సిపిఐ మండల కార్యదర్శి కుడుదుల వెంకటేష్‌తో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఒక్క పోడు రైతుకూ పట్టా ఇవ్వలేదు
RELATED ARTICLES