కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కెటిఆర్ ఆగ్రహం
ప్రజాపక్షం / హైదరాబాద్ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో ఒక్కో కుటుంబం నుంచి రూ.లక్ష పెట్రో పన్నును దోచుకున్నదని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు మండిపడ్డారు. ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి సర్కారు ‘ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకం’ ప్రవేశపెట్టిందని ఎద్దేవా చేశారు. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను ప్రధాని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు తిరస్కరించడం ఖాయమని హెచ్చరించారు. పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కెటిఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాల నుంచి రూ. 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్ను వేసిన పనికిమాలిన ప్రభుత్వం బిజెపిదేనని అన్నారు. ప్రతిది దేశం కోసం.. ధర్మం కోసం అంటారని, ఈ దోపిడీ కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా? అని నిలదీశారు. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం.. నీతిలేకుండా రాష్ర్ట ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదం చేస్తుందని మండిపడ్డారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గొప్పులు చెప్పుకునే మోడీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందని ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా ముడి చమురు రేటు పెరిగినా.. తగ్గినా దేశంలో రేట్లు పెంచడమే పనిగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నదని విమర్శించారు. పన్నులు పెంచడమే పరిపాలనగా భ్రమిస్తున్నదని, పెట్రో ధరల పేరిట ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బిజెపి అని విమర్శించారు. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే మరోవైపు ఆ పాపాన్ని రాష్ర్ట ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బిజెపి ఒడిగడుతున్నదని, నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా బలాదూర్‌గా తిరిగొస్తుందని కెటిఆర్ అన్నారు. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా పెట్రో రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, అది చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్ళ నుంచే కేంద్ర ప్రభుత్వం తన చేతకానితనం, తమకు అస్సలు తెలియని ఆర్థిక విధానాలతో ప్రజలను పీడించుకు తింటున్నదని, తానిలా విమర్శించడానికి అడ్డూ అదుపు లేకుండా రోజువారీగా పెరుగుతున్న పెట్రో రేట్లు, ఆకాశాన్ని దాటి అంతరిక్షానికి చేరుకుంటున్న నిత్యావసరాల ధరలే కారణమన్నారు. అమెరికా, కెనడా, యుకె, జర్మనీ, ఫ్రాన్స్‌లో కూడా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్న కేంద్రమంత్రులు.. అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ మనకంటే తక్కువే అన్న సంగతిని కావాలనే దాస్తున్నారని విమర్శించారు. అంతెందుకు పకనున్న దాయాది దేశాలతోపాటు, అర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ ఇప్పటికి అత్యంత చవక దరకే పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 2014లో బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి అంతర్జాతీయంగా ఉన్న ముడిచమురు ధర సుమారు 105 డాలర్లు అని, ఆ తర్వాత వివిధ కారణాల వలన ఒకానొక దశలో సుమారు 40 డాలర్ల దిగువకు ముడిచమురు ధరలు తగ్గినా.. దేశంలో మాత్రం పెట్రో ధరలను బిజెపి ప్రభుత్వం పెంచుతూనే ఉన్నదన్నారు. 2014లో సుమారు 70.51 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధరను, రు.53.78గా ఉన్న డీజిల్ ధరను క్రమంగా పెంచుతూ నేటికి రూ. 118.19కు, డీజిల్‌ను రూ.104.62కు పెంచిందని కెటిఆర్ వివరించారు. 2014లో క్రూడ్ ఆయిల్‌కు ఎంత ధర ఉందో ఇప్పుడు కూడా అంతే మొత్తంగా బ్యారెట్‌కు 106 డాలర్లే ఉన్నదని, పెట్రోల్ ధర మాత్రం రెట్టింపు అయిందన్నారు. ప్రజలకు ప్రయోజనం కలిగేలా పెట్రో రేట్లను తగ్గించేందుకు వేంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేశ ప్రజల తరపున తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
ఒక్కో కుటుంబం నుంచి రూ.1,00,000 పెట్రో పన్ను దోపిడీ
RELATED ARTICLES