కశ్వి గౌతమ్ సంచలనం
అరుణాచల్ ప్రదేశ్: చండీగఢ్ కెప్టెన్ కశ్వి గౌతమ్ సంచలన బౌలింగ్ చేసింది. ఒకే మ్యాచ్‌లో ఏకంగా పది వికెట్లు పడగొట్టి రికార్డుల్లోకి ఎక్కింది. బీసీసీఐ అండర్ 19 వన్డే మహిళా క్రికెట్ ట్రోఫీలో కశ్వి గౌతమ్ 10 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇక్కడి కేఎస్‌ఆర్‌ఎం కళాశాల మైదానంలో మంగళవారం అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కశ్వి ఈ ఘనత సాధించింది. 29 బంతుల్లోనే 10 వికెట్లు పడగొట్టడం విశేషం.
కశ్వి కెప్టెన్ ఇన్నింగ్స్
ముందుగా బ్యాటింగ్ చేసిన చండీగఢ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. చండీగఢ్ బ్యాట్స్‌వుమన్‌లలో కశ్వి గౌతమ్ (49), సిమ్రన్ జోహల్ (42), మెహుల్ (41) పరుగులతో రాణించారు. గౌతమ్ తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయింది. అయితే 68 బంతుల్లో కీలక 49 పరుగులు చేసి తన జట్టుకు విలువైన రన్స్ అందించింది. అంతేకాదు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించింది. స్వల్ప లక్ష్య చేధనకు దిగిన అరుణాచల్ ప్రదేశ్ కశ్వి గౌతమ్ దెబ్బకు కేవలం 8.5 ఓవర్లలో 25 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో చండీగఢ్ 161 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అరుణాచల్ అమ్మాయిలలో మేఘా శర్మ (10) ఒక్కరే నాటౌట్‌గా నిలిచారు. కశ్వి చెలరేగడంతో ఎనిమిది మంది డకౌట్ అయ్యారు. ఒక్కరు కూడా క్రీజులో నిలబడడానికి ప్రయత్నించలేదు. కేవలం 29 బంతుల్లోనే కశ్వి అరుణాచల్‌ప్రదేశ్ జట్టును పెవిలియన్‌కు పంపింది.
12 పరుగులు.. 10 వికెట్లు
కశ్వి గౌతమ్ 4.5 ఓవర్లలో 12 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టింది. ఇందులో ఆరు ఎల్బీడబ్ల్యూలు, నాలుగు క్లీన్ బౌల్డ్ ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన కశ్వి గౌతమ్ తన జట్టుకు ఒంటిచేత్తో భారీ విజయాన్ని అందించింది. టోర్నమెంట్ అంతటా కశ్వీ గౌతమ్ నిప్పులు చెరిగింది. ఆడిన మూడు మ్యాచులలోనే ఏకంగా 18 వికెట్లు తీసుకుంది. చండీగఢ్ తన తదుపరి మ్యాచులో ఫిబ్రవరి 28న పాండిచేరితో తలపడనుంది. పరిమిత ఓవర్ ఫార్మాట్ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నేపాల్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మహాబూబ్ ఆలం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆలం 12 పరుగులకు 10 వికెట్లు తీసాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో జిమ్ లేకర్ (ఇంగ్లండ్), అనిల్ కుంబ్లే (భారత్) మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించారు. డొమెస్టిక్ క్రికెట్‌లో మాత్రం రెక్స్ రాజ్‌సింగ్, దేబాషిష్ మొహాంతీ, నిర్దేశ్ బైసోలాలు ఈ ఫీట్‌ను అందుకున్నారు.
ఒకే మ్యాచ్ పది వికెట్లు
RELATED ARTICLES