భార్య, పిల్లలకు విషమిచ్చి తాను విషం పుచ్చుకున్న రాంప్రసాద్
ఖమ్మంలో విషాద ఘటన
ప్రజాపక్షం / ఖమ్మం : పెద్దగా కలతలు లేని కుటుంబం, ఆర్థికంగా నూ అంతగా ఇబ్బంది లేదు. అయినా భార్య, ఇద్దరు పిల్లలకు విష ఆహారం తినిపించి తాను తిని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటన స్థానికులను, బంధువులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఖమ్మంజిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన రాంప్రసాద్ (43) గతంలో ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. 20 సంవత్సరాల క్రితం ఇదే మండల పరిధిలోని బాణాపురంకు చెందిన సుచిత్ర (38)తో వివాహం జరిగింది. వీరికి రుచిత (13), జాహ్నవి (9) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంత కాలం క్రితం రాంప్రసాద్ లెక్చరర్ ఉద్యోగం మానేసి తన సొంత బావమరిది గ్రానైట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, గురువారం రాత్రి బిర్యానీ, రోటీ హోటల్ నుంచి పార్సిల్ తెచ్చాడు. అనుమానం రాకుండా వాసన లేని విష గుళికలు కలిపాడు. భార్య, ఇద్దరు పిల్లలు తిని వారి గదికి వెళ్లి నిద్రించిన తర్వాత రాంప్రసాద్ కూడా అదే విష ఆహారం తిని నిద్రించాడు. తెల్లవారే సరికి విగతజీవులుగా పడి ఉన్నారు. శుక్రవారం రాంప్రసాద్ బంధువులకు సంబంధించిన శుభకార్యం ఒకటి ఖమ్మంలో ఉండడంతో సుచిత్ర తల్లిదండ్రులు రాంప్రసాద్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. శుభకార్యం వద్దకు రాకపోవడం, ఫోన్ ఎత్తకపోవడంతో సుచిత్ర తండ్రి వచ్చి కిటికిలో నుంచి చూడగా లోపల విగతజీవిగా పడి ఉన్న కూతురు కన్పించింది. వెంటనే చుట్టు పక్కల వారిని పిలిచి చూడగా నలుగురు మృతి చెంది ఉన్నారు. రాంప్రసాద్ బావమరిది వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటన స్థలాన్ని డిసిపి మురళిధర్, ఖమ్మం ఎసిపి వెంకట్రావు పరిశీలించారు. మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆర్థిక పరమైన కారణాలా, మరేదైనా అన్న విషయం పోలీసుల విచారణలో తేలనుంది.