HomeNewsBreaking Newsఒకే ఒక్కడు

ఒకే ఒక్కడు

ఐసిసి హ్యాట్రిక్‌ అవార్డులను గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించిన భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ
ఐసిసి టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా కూడా ఎంపిక
దుబాయ్‌: భారత స్టార్‌ క్రికెటర్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. తన బ్యాట్‌తో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ తాజాగా ఐసిసి ప్రకటించిన అవార్డుల్లో హ్యాట్రిక్‌ సాధించాడు. ఇప్పటివరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. మంగళవారం ఐసిసి ప్రకటించిన 2018 మూడు ప్రధాన అవార్డులను కోహ్లీ దక్కించుకున్నాడు. 2018 బెస్ట్‌ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, బెస్ట్‌ టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌తో పాటు ఐసిసి బెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకుని సర్‌ గ్యారిఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా మరో అరుదైన గౌరవంను కోహ్లీ దక్కించుకున్నాడు. ఐసిసి టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా కూడా ఎంపిక అయ్యాడు. 2018లో అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పారించాడు. తన బ్యాటింగ్‌తో, కెప్టెన్సీతో ఎన్నో రికార్డులను చెరిపేస్తున్న కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు. అతనికి సాధ్యం కానీ రికార్డు ఏదిలేదనీ నిరూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. టెస్టు, వన్డే ఏ ఫార్మాట్‌ అయినా సరే పరుగులు సాధించడం పాత రికార్డులను అధిగమించడమే అతనికి తెలుసు. ఇతను బ్యాట్‌ పడితే చాలు ప్రత్యర్థి బౌలర్లకు వణుకు. ఏ సమయంలో ఏవరి ఏ రికార్డును చెరిపేస్తాడోనని మాజీ క్రికెటర్ల అందోళన. క్రికెట్‌ చరిత్రలో దాదాపు చాలా రికార్డులను కోహ్లీ సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో గొప్ప ఆణిముత్యంగా పేరుసంపాదించుకున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఎక్కడైనా సరే రన్‌ మిషన్‌కు ఒక్కటే తెలుసు పరుగులు రాబట్టడం. వేదిక గురించి పట్టించుకోడు కేవలం తన బ్యాటింగ్‌పైనే దృష్టి పేడుతాడు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ తన ఉనికిని చాటుకున్నాడు. అపారమైన ప్రతిభతో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు ది గ్రేట్‌ విరాట్‌ కోహ్లీ. 2018 సంవత్సరానికి సంబంధించిన ఐసిసి మూడు ప్రధాన అవార్డులను విరాట్‌ కోహ్లీ కైవసం చేసుకొని తన సత్తా చాటుకున్నాడు. 2008లో భారత్‌కు అండర్‌ ప్రపంచకప్‌ అందించిన కోహ్లీ ఆ తర్వాత నుంచి వెనక్కితిరిగి చూడలేదు. వరుసగా మంచి ప్రదర్శనలతో సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. గత ఏడాది క్రికెట్‌లో రాణించిన దాన్ని బట్టి ఈ అరుదైన అవార్డులను కైవసం చేసుకున్నాడు. 2018లో కోహ్లీ 13 టెస్టుల్లో 55.08 సగటుతో 1322 పరుగులు చేశాడు. అందులో ఐదు శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ కింగ్‌ కోహ్లీకి ఎదురులేకుండా పోయింది. మొత్తం 14 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 133.55 సగటుతో 1202 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 10 టి20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 211 పరుగులు చేశాడు. ఒక క్యాలండర్‌ ఇయర్‌లో టెస్టుల్లో, వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన క్రికెటర్‌గా కూడా కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఓవరాల్‌గా చూస్తే కోహ్లీ గత ఏడాది మొత్తం 37 మ్యాచుల్లో 68.33 సగటుతో 2375 పరుగులు చేశాడు. అందులో (11 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు) ఉన్నాయి. ఇతని సారథ్యంలోనే గత కొంతకాలంగా టెస్టుల్లో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నది. కోహ్లీ సారథ్యంలోనే భారత జట్టు ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్టు సిరీస్‌ విజయాన్ని నమోదు చేసింది. ఏ కెప్టెన్‌కు సాధ్యం కాని ఘనతను కోహ్లీ టీమిండియాకు అందించాడు. ఈ నూతన ఏడాది కూడా కోహ్లీ అదే జోరును కొనసాగించాలని అందరూ కోరుతున్నారు.
సంతోషంగా ఉంది: కోహ్లీ..
ఐసిసి అరుదైన అవార్డులను గెలుచుకున్న భారత సారథి విరాట్‌ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. తన కష్టానికి ఫలితం దక్కిందని చెప్పాడు. ఐసిసి హ్యాట్రిక్‌ అవార్డులను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఇలాగే కష్టపడి మరిన్ని అవార్డులు, విజయాలు భారత్‌కు అందిస్తానని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. ఇంతకుముందు 2017లో కూడా కోహ్లీ ఐసిసి ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు గెలుచున్నాడు. 2012లో ఐసిసి బెస్ట్‌ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును దక్కించుకున్నాడు.
ఎమర్జింగ్‌ ప్లేయర్‌గా పంత్‌..
ఇక భారత యువ సంచలనం రిషభ్‌ పంత్‌కు కూడా అరుదైన గౌరవం దక్కింది. ఐసిసి ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2018 అవార్డుకు రిషభ్‌ పంత్‌ ఎంపికయ్యాడు. గత ఏడాది టెస్టుల్లో అరంగేటం చేసిన 21 ఏళ్ల రిషభ్‌ పంత్‌ అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. సీనియర్లతో పోటీ పడి జట్టులో తన ఉనికిని చాటుకున్నాడు. గత ఏడాది కీపింగ్‌లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్‌ వేదికగా జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 11 క్యాచ్‌లు అందుకొని కొత్త రికార్డు సృష్టించాడు. భారత్‌ తరఫున ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న తొలి వికెట్‌ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో సెంచరీలు సాధించిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా కూడా పంత్‌ రికార్డుల్లో నిలిచాడు. ఇతని శ్రమకు తగిన ఫలితం దక్కింది. ఐసిసి ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో సత్కరించింది. అంతే కాకుండా ఐసిసి తన 2018 టెస్టు జట్టులో వికెట్‌ కీపర్‌గా కూడా పంత్‌ను ఎంపిక చేసింది. ఐసిసి 2018 టెస్టు, వన్డే జట్లకు విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టెస్టు జట్టులో రిషభ్‌ పంత్‌ వికెట్‌ కీప
ర్‌గా.. భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా టెస్టు, వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. వన్డే జట్టులో రోహిత్‌ శర్మ, కుల్దీప్‌ యాదవ్‌లు చోటు సంపాదించారు.
ఐసిసి జట్ల వివరాలు:
టెస్టు జట్టు (2018) : విరాట్‌ కోహ్లీ (భారత్‌, కెప్టెన్‌), టామ్‌ లాథమ్‌ (న్యూ జిలాండ్‌), డిముత్‌ కరుణరత్నే (శ్రీలంక), కేన్‌ విలియమ్‌సన్‌ (న్యూజిలాండ్‌), హెన్రీ నికొలాస్‌ (న్యూజిలాండ్‌), రిషభ్‌ పంత్‌ (భారత్‌, వికెట్‌ కీపర్‌), జాసన్‌ హోల్డర్‌ (వెస్టిండీస్‌), కగిసొ రబాడ (సౌతాఫ్రికా), నాథన్‌ లియాన్‌ (ఆస్ట్రే లియా), జస్ప్రీత్‌ బుమ్రా (భారత్‌),
మహ్మద్‌ అబ్బాస్‌ (పాకిస్థాన్‌).
వన్డే జట్టు (2018) : విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, జానీ బైరిస్టో (ఇంగ్లాండ్‌), జోయ్‌ రూట్‌ (ఇంగ్లాండ్‌), రాస్‌ టేలర్‌ (న్యూజిలాండ్‌), జాస్‌ బట్లర్‌ (ఇంగ్లాండ్‌, వికెట్‌ కీపర్‌), బెన్‌ స్టోక్‌ (ఇంగ్లాండ్‌), ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ (బంగ్లాదేశ్‌), రషీద్‌ ఖాన్‌ (అఫ్ఘాని స్థాన్‌), కుల్దీప్‌ యాదవ్‌ (భారత్‌), జస్ప్రీత్‌ బుమ్రా (భారత్‌).

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments