వరదలకు నష్టపోయిన పంటలను సర్వే చేసి రైతులకు నష్టపరిహారం : తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్
వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా, కమిషనర్‌కు వినతి
ప్రజాపక్షం/హైదరాబాద్: ఒకేసారి రుణమాఫీ చేసి, కొత్తగా రుణాలు ఇవ్వాలని, ఇటీవల భారీ వర్షాలకు వరదలకు నష్టపోయిన పంటలను సర్వే చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం రైతు సంఘం ప్రతినిధుల బృందం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడుతూ 2018 డిసెంబర్ 11 నాటికి 42 లక్షల మంది రైతులు బ్యాంకులలో చెల్లించాల్సిన లక్ష రూపాయాల లోపు పంట రుణ బకాయిలను మాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్ ప్రభు త్వం చేసిన వాగ్దానం అమలుకు నోచుకోలేదన్నారు. గత సంవత్సరంలో కేవలం రూ. 25 వేల లోపు రైతుల రుణాలను మాఫీ చేశారని, రూ 25 వేల పైబడిన వారి రుణాలను రద్దు చేయలేదని, అలాగే కనీసం వడ్డీ కూడా చెల్లించలేదని వివరించారు. దీంతో రైతులపై వడ్డీ భారం పెరుగుతోందని పశ్యపద్మ ఆవేదన వ్యక్తం చేశారు. 2020, మే లో ఆంధ్రాబ్యాంకుకు రూ.65. 87 కోట్లను, ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి 4న 14 బ్యాంకులకు కేవలం రూ.13.16 కోట్ల చెల్లించినట్టు స్టేట్ లెవెల్ బ్యాంకుల కమిటీ తన మినిట్స్‌లో తెలిపిందన్నారు. బ్యాంకులకు రాష్ట్రప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ కింద చెల్లించాల్సిన బకాయి స్టేట్ లెవెల్ బ్యాంకుల కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం రూ. 725.25 కోట్లు ఉన్నదని వివరించారు. ప్రతి ఆరు నెలలకు రైతుల ఖాతాలలో అసలు లోకి వడ్డీని కలిపి మొత్తం మీద తిరిగి వడ్డీ వేస్తున్నారని వివరించారు. 2018 డిసెంబర్ 11 నాటికి బ్యాంకులలో ఉన్న లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేయాలని, లేదా ఇప్పటి వరకు పెరిగిన వడ్డీ మొత్తాన్ని వేసి రైతులకు కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా పంట రుణాల లక్ష్యంలో 30 శాతం కూడా బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వలేదన్నారు. రుణ మాఫీని వెంటనే అమలు చేసి, కొత్తగా పంట రుణాలు అoదేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల అదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో సోయా, రాష్ట్ర వ్యాప్తంగా పత్తి, నిజామాబాద్ జిల్లాలో వరి పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. సర్వే చేసి పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు రూ.15 వేల నుండి రూ.50 వేల వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు విశ్వేశ్వరరావు ఉపాధ్యక్షులు ఉజ్జిని యాదగిరిరావు మాజీ ఎంఎల్‌ఎ, ఉప ప్రధాన కార్యదర్శి ఏపూరి బ్రహ్మం, పాల రైతుల ప్రధానకార్యదర్శి కొల్లూరి రాజయ్య, కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.సూర్యనారాయణ నాయకులు వర్ల వెంకటయ్య, పి. రామకృష్ణారెడ్డి, దేవభక్తుని సంధ్య ప్రభు లింగం, వీరగోని శంకరయ్య, దొడ్డ వెంకటయ్య, వెంకట్, రామచంద్రయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి సలిగంటి భవాని తదితరులు పాల్గొన్నారు.
ఒకేసారి రుణమాఫీ… కొత్త రుణాలు
RELATED ARTICLES