అంతరిక్షంలో అద్భుతాలు : దొరికిన సాక్ష్యాలు
లండన్: అంతరిక్షంలో కృష్ణబిలాలు ఏకమవుతున్నాయి. పెద్దసంఖ్యలో వున్న మహా కృష్ణబిలాలు విలీనమవుతున్నట్లు ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనికి సంబంధించిన సంకేతాలు కన్పించాయి. సాక్ష్యాలు కూడా లభించినట్లు వారు తెలిపారు. రెట్టింపు పరిమాణంలో వున్న మహా ద్రవ్యరాశి గల కృష్ణబిలాలు మరో పెద్ద కృష్ణబిలంతో విలీనమవుతున్న దృశ్యాన్ని బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ హెర్ట్‌ఫోర్డ్‌షైర్ శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం వెల్లడించింది. అంతరిక్షంలో అనేకమైన నక్షత్ర మండలాలు వున్నాయి. వీటన్నింటికీ కేంద్రకాలుగా వున్న కృష్ణబిలాలు కూడా చాలా వున్నాయి. ఒక్కో కృష్ణబిలం చుట్టూ వున్న నక్షత్ర మండలాలు నెమ్మదిగా బిలం వద్దకు చేరుకుంటున్నాయి. అలా జరిగిన ప్రతిసారీ ఆయా నక్షత్ర మండలాలు మాయమవుతూ వుంటాయని ఒక అంచనా. ఎప్పటికైనా మన సౌర వ్యవస్థ సైతం అంతం కావాల్సిందేనని చెపుతున్నారు. అందుకే ఎప్పటి నుంచో కృష్ణబిలాలపై పెద్దఎత్తున పరిశోధనలు సాగుతున్నాయి. వాటికి సంబంధించిన శక్తివంతమైన రేడియో మ్యాప్‌లపై కూడా పరిశోధనలు సాగించారు. ప్రస్తుతం కృష్ణబిలాలు ఒక్కొక్కటిగా విలీమవుతున్నట్లు చెపుతున్నారు. ఆరు మాసాల క్రితం రెండు కృష్ణబిలాలు కలిశాయి. అయితే అవి ఢీకొన్నట్లు చెప్పుకున్నారు. నిజానికి అవి విలీనమవుతున్నాయని తాజాగా శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కృష్ణబిలాలు వాటికవే తమ కక్ష్యలకు సమీపిస్తున్నాయి. ఇలా కలిసిన మహా కృష్ణబిలాలు శక్తివంతమైన జెట్స్‌ను తమలోకి ఆకర్షిస్తాయి. దశలవారీగా ఇది జరుగుతున్నది. బహుశా రెండు కృష్ణబిలాలు విలీనం కావాలంటే కొన్ని వేల, మిలియన్ సంవత్సరాలు పట్టవచ్చు. మొత్తానికి విలీనమనేది అనివార్యంలా కన్పిస్తున్నదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అంతరిక్షంలో నక్షత్ర మండలాలను మోసుకుపోయే కృష్ణబిలాలు విలీనమయ్యే కొద్దీ విశ్వంలో ఎలాంటి పరిణామాలైనా సంభవించవచ్చని, అది అంతమైనా, లేక ఇంకో యుగానికి ఆది అయినా జరగవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.