కేవలం గ్రీనరీ పెంపకానికే అనుమతులు
భవన నిర్మాణాలకు 15 మీటర్ల సెట్‌బ్యాక్ తప్పనిసరి
హెచ్‌ఎండిఎ అధికారుల సమీక్షలో కమిషనర్ అర్వింద్ కుమార్
ప్రజాపక్షం/హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరు వైపులా ఉన్న 15 మీటర్ల బఫర్ జోన్ ప్రాంతంలో ఎలాంటి తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు బఫర్ జోన్‌లో కేవలం గ్రీనరీ పెంపకానికి మాత్రమే అనుమతి ఉందని వెల్లడించింది. బుధవారం హెచ్‌ఎండిఎ, ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఉన్నతాధికారులతో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండిఎ కమిషనర్ అర్వింద్ కుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఒఆర్‌ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేయని ప్రైవేట్ భూ యజమానులు ఒఆర్‌ఆర్ వెంట కచ్చితంగా బఫర్ జోన్ నిబంధనలను పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బఫర్ జోన్ వెంట భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సందర్భంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు 15 మీటర్ల సెట్‌బ్యాక్ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. నిర్దేశించిన బఫర్ జోన్‌లో హోర్డింగ్‌లు, యూనిపోల్స్, టెలికాం టవర్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డిష్ ఆంటెనాలు కూడా ఉండడానికి వీల్లేదన్నారు. బఫర్ జోన్ పరిధిలోని ప్రహారీగోడలు, బారికేడింగ్ షీట్స్ వంటి వాటిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్‌రింగ్ రోడ్డు ఇరువైపులా 15 మీటర్లు (50అడుగులు) బఫర్‌జోన్‌గా హెచ్‌ఎండిఎ ప్రకటించిందన్నారు. వీటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను (జిఒ నెంబర్ 470, జిఒ నెంబర్ 440) ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు, డెవలపర్స్, ప్రభుత్వస్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీలు) తప్పని సరిగా పాటించాలని ఆదేశించారు. ప్రైవేట్ భూ యజమానులు భవన నిర్మాణ సమయంలో బఫర్‌జోన్‌ను గ్రీనరీ కింద, ఓపెన్ స్పేస్ కింద చూపించి, అనుమతులు పొందే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అర్వింద్ కుమార్ సూచించారు.
ఒఆర్‌ఆర్ బఫర్‌జోన్‌లో నిర్మాణఅనుమతులకు చెక్
RELATED ARTICLES