ప్రజాపక్షం/హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రగతికి దిక్సూచిగా మారింది. నగరం చుట్టూ 158 కిలోమీటర్లు ఉన్న ఓఆర్‌ఆర్ చుట్టూ కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉండడంతో అభివృద్ధికి కేరాఫ్‌గా మారుతోంది. కొత్తగా వచ్చే దేశ, విదేశీ కంపెనీలు ఎయిర్‌పోర్టు కనెక్టవిటీ సులభంగా ఉండడంతో ఓఆర్‌ఆర్ చుట్టే తమ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మొగ్గు చూపుతున్నాయి. నగరానికి దూరంగా ప్రశాంత వాతావరణం ఉండడంతో రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశీ రియల్టీ సంస్థలు ఆకాశహర్మ్యాలను ఓఆర్‌ఆర్ చుట్టే నిర్మిస్తున్నాయి. నివాస, వ్యాపార భవనాలే కాకుండా ఫార్మా, లైఫ్‌సైన్సెస్, డిఫెన్స్, ఏరోస్పేస్, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన రంగాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు ఔటర్ చుట్టూ ఏర్పాటవుతుండటంతో ఔటర్ రింగు రోడ్డు సరికొత్త హాట్‌స్పట్‌గా మారిపోయింది.
ఐటి కారిడార్‌గా మారిన ఓఆర్‌ఆర్..
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్నీ ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఏర్పాటవుతున్నాయి. మహానగరానికి మణిహారంలా మారిన 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ చుట్టూ కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉండడంతో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఓఆర్‌ఆర్ నుంచి అత్యంత మెరుగైన రోడ్ల అనుసంధానం కోర్ సిటీకి ఉండడంతో శివారు ప్రాంతాల్లోనూ కొత్తగా తమ ప్రాజెక్టులను చేపట్టేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. నగరానికి పడమర దిక్కున ఉన్న ఐటి కారిడార్ వైపు మాత్రమే కాకుండా దక్షిణ, ఉత్తర, తూర్పు దిక్కుల వైపు ఉన్న ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా కొత్తగా ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయి. 2012 నుంచి దశల వారీగా అందుబాటులోకి వచ్చిన ఓఆర్‌ఆర్ 2018 నాటికి పూర్తి స్థాయిలో రాకపోకలు సాగిస్తూ, అభివృద్ధికి
కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఒకప్పుడు నగర శివారులో ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఐటి రంగం అభివృద్ధితో ఐటి కారిడార్‌లో భాగంగా మారిపోయింది.
50 ఏళ్లకు సరిపడేలా మౌలిక వసతుల కల్పన..
హైదరాబాద్ మహానగరం నలుమూలలా విస్తరిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అందులో భాగంగానే విస్తరిస్తున్న మహానగరానికి 50 ఏళ్ల వరకు సరిపడేలా వసతుల కల్పన శ్రీకారం చుట్టింది. తాగునీటి సరఫరా కోసం గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చే పైపులైను మార్గాలను కలుపుతూ ఓఆర్‌ఆర్ చుట్టూ రింగు మెయిన్ పేరుతో భారీ పైపు లైను నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ప్రజా రవాణ వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న మెట్రో రైలు సౌకర్యాన్ని సైతం ఐటి కారిడార్‌లోని రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌కు 4 చోట్ల రైల్వే మార్గాలు అనుసంధానమై ఉండగా, వాటికి సమీపంలోనే కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్‌ను నిర్మించాలన్న ప్రతిపాదనను రూపొందించారు. కోర్ సిటీ నుంచి ఔటర్ వరకు 33 రేడియల్ రోడ్డు నిర్మిస్తూ శివారు ప్రాంతాలకు మెరుగైన ప్రజా రవాణ వ్యవస్థలను సైతం విస్తరిస్తున్నారు.
19 నుంచి 22 ఇంటర్‌ఛేంజ్‌లు..
ఔటర్ మార్గం ప్రగతి హారంగా మారడంతో ఓఆర్‌ఆర్ అభివృద్ధిపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండిఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓఆర్‌ఆర్ చుట్టూ మొదట 22 ఇంటర్‌ఛేంజ్‌లతో నిర్మిస్తే, తర్వాతి కాలంలో జరుగుతున్న అభివృద్ధిని, అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరో 3 చోట్ల( నార్సింగి, కోకాపేట, మల్లంపేట) కొత్తగా ఇంటర్‌ఛేంజ్‌లను నిర్మిస్తోంది. ఇటీవలనే నార్సింగి ఇంటర్‌ఛేంజ్ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. దీంతో కోర్ సిటీ నుంచి ఓఆర్‌ఆర్‌కు చేరుకొని అక్కడి నుంచి ఎక్కడికైనా సరే వేగంగా వెళ్లేలా రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌ఛేంజ్‌ల నుంచి కోర్ సిటీకి వెళ్లాలన్నా, జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు అత్యంత సులభంగా సాగించేలా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు.
డేటా సెంటర్లు సైతం..
ఐటి రంగానికి ఆయువు పట్టులాంటి డేటా సెంటర్లు సైతం హైదరాబాద్ కేంద్రంగా భారీ విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకుంటున్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలే ఔటర్ రింగు రోడ్డు బయట భారీ ఎత్తున డేటా సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాయి. ఈ మూడు కంపెనీలే కాకుండా దేశీయ, విదేశీ కంపెనీలు సైతం మరిన్ని డేటా సెంటర్లను నగర శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు డేటా సెంటర్లకు అత్యంత అనుకూలంగా ఉన్నట్లు గుర్తించిన ప్రైవేటు సంస్థలు 20 నుంచి 50 ఎకరాల్లో భారీ విస్తీర్ణంతో కూడిన డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టాయి.
పారిశ్రామిక వాడలు..
ఓఆర్‌ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను బయటి తరలించాలన్న లక్ష్యం పెట్టుకొని కార్యాచరణ అమలు చేయడంతో కొత్తగా పరిశ్రమలన్నీ ఔటర్ బయటే వస్తున్నాయి. మహేశ్వరం, తుక్కుగూడ, కొంగర కలాన్ ప్రాంతాల్లో ఫ్యాబ్ సిటీ, ఈ-సిటీ వంటివి రాగా, ముచ్చర్ల సమీపంలో దేశంలోని అతి పెద్దదైన ఫార్మాసిటీ నిర్మాణం పురోగతిలో ఉంది. వీటితో పాటు శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్లే మార్గంలో చందన్వెల్లి, సీతారాంపూర్లలో రెండు పారిశ్రామిక వాడలు కొత్తగా ఏర్పాటయ్యాయి. పటాన్‌చెరువు- మేడెల్‌ల మధ్య సుల్తాన్ పూర్ వద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటైంది. తూర్పు వైపున పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్ దాటిన తర్వాత బాట సింగారం లాజిస్టిక్ పార్కు, మంగల్‌పల్లి వద్ద మరో లాజిస్టిక్ పార్కు నిర్మాణాలు జరుపుకొని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక చౌటుప్పల్ సమీపంలోని దండు మల్కారంలో చిన్న తరహా పరిశ్రమల కోసం వేయికి పైగా ఎకరాల్లో పారిశ్రామిక కేంద్రం ఏర్పాటైంది. ఇలా నగరం చుట్టూ ఓఆర్‌ఆర్‌ను కేంద్రంగా చేసుకొని పారిశ్రామిక వాడలు ఏర్పాటవుతున్నాయి. ఇవే కాకుండా రాష్ట్రంలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్ కొత్తపేట నుంచి ఔటర్ రింగు రోడ్డు పక్కన కొహెడలోని 100 ఎకరాల్లో శాశ్వత మారెట్ నిర్మాణ పనులు చేపట్టారు.
ఒఆర్‌ఆర్‌ప్రగతికి దిక్సూచి
RELATED ARTICLES