దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రటించిన టి20 ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ స్థానం మెరుగుపడింది. అతను ఏకంగా 14 స్థానాలు అధిగమించి, 15వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 276 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. అంతేగాక, 2019 తర్వాత అతను తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఈ బ్యాటింగ్ ప్రతిభ కారణంగా అతని ర్యాంక్ మెరుగుపడింది. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ రిజ్వాన్ 810 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాగా, ఈ జాబితాలో భారత్ తరఫున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సూర్య కుమార్ యాదవ్ అత్యుత్తమంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కోహ్లీతో సమానంగా 606 పాయింట్లతో 14వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగానికి వస్తే, భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఒక స్థానం పతనమై, ఏడో స్థానంతో సరిపుచ్చుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 9 స్థానాలు మెరుగుపరచుకొని 41వ స్థానానికి, అక్షర్ పటేల్ 14 మెరుగుపడి 57వ స్థానానికి చేరుకున్నారు. ఈ విభాగంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జొష్ హాజెల్‌వుడ్ 792 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించగా, దర్బాజ్ షమీ (దక్షిణాఫ్రికా/ 716 పాయింట్లు), అదిల్ రషీద్ (ఇంగ్లాండ్/ 702 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఐసిసి ర్యాంకింగ్స్‌లో కోహ్లీ స్థానం మెరుగు
RELATED ARTICLES