ప్రజాపక్షం/హైదరాబాద్: ఐపిఎస్‌ల బదిలీలలకు రాజకీయ గ్రహణం పట్టింది. ఐపిఎస్ బదిలీల జాబితా దాదాపు సిద్ధమైనప్పటికీ రాజకీయ ఒత్తిడితో రోజుకో మలుపు తిరుగుతోంది. అందులో పేర్లు, పోస్టులు తారుమారు అవుతుండడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. తమకు అనుకులమైన ఐపిఎస్ అధికారులను మంచి పోస్టింగ్‌లను ఇప్పించుకునేందుకు కొందరు అధికార పార్టీ ఎంఎల్‌ఎలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఐఎఎస్‌ల బదిలీ జరిగిన నేపథ్యంలో ఇక ఐపిఎస్‌ల బదిలీలు జరగాల్సి ఉన్నది. ఐపిఎస్‌ల సర్వీసు, వారి పనితీరు ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఐపిఎస్ బదిలీ జాబితాను రూపొందించినట్టు విశ్వసనీయ సమాచారం. కానీ కొన్ని పోస్టింగ్‌లు, కొందరు ఐపిఎస్‌ల విషయంలో కొందరు అధికార పార్టీ ఎంఎల్‌ఎలు జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్‌పిల బదిలీల విషయంలో అధికార పార్టీ ఎంఎల్‌ఎలు, మంత్రుల మధ్య సయ్యోధ్య కుదరడంలేదని సమాచారం. తద్వారా జిల్లా ఎస్‌పిల బదిలీ జాబితా ఆలస్యం కావడానికి ఇదొక కారణంగా తెలుస్తోంది. దీంతో ఐపిఎస్‌ల బదిలీలు ఉన్నతాధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రధానంగా పోలీస్ కమిషనరేట్ల విషయంలో రాజకీయ జోక్యం పెరిగినట్టు తెలుస్తోంది. అలాగే కొన్ని శాఖలకు డిప్యూటేషన్‌పై పంపించిన ఐపిఎస్‌ల పనితీరు పట్ల కూడా కొందరు ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్టు సమాచారం. ఇటీవల జిహెచ్‌ఎంసి పాలక మండలి సర్వసభ్య సమావేశంలో జిహెచ్‌ఎంసిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరక్టర్(ఐపిఎస్) విశ్వజీత్ కంపాటిపై టిఆర్‌ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇష్ఠానురీతిగా ఛలానాలు విధిస్తున్నారని, తద్వారా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని వారు వాపోతున్నా రు. ఇదే విషయమై కొందరు కార్పొరేటర్లు విశ్వజీత్‌ను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని మంత్రులను కోరినట్టు తెలిసింది. ఇక ముఖ్యంగా వచ్చే ఏడాది హైదరాబాద్‌లో జిహెచ్‌ఎంసికి ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను నియమించనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే టిఆర్‌ఎస్ బడా నేతలు పోలీసు బాస్‌తో చర్చించినట్లు తెలిసింది. ఇక సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో కూడా జిహెచ్‌ఎంసి ఎన్నికల పరిధి వస్తుంది. ఇక్కడ కూడా ఆచీతూచి కమిషనర్లను నియమించేందుకు కరసత్తు జరుగుతుంది. ఎన్నికలు సాఫీగా జరగడంతో పాటు అధికార పార్టీకి తలనొప్పిగా లేని అధికారి ఉండాలని టిఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇక ఇటీవలే ఐపిఎస్ బదిలీలపై కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారి పేర్లు, పోస్టులు అందులో పెట్టారు. అవి ఎంతవరకు వాస్తవమో తెలియదుగాని దానిపై పోలీసు బాస్ గుస్సాగా ఉన్నట్లు సమాచారం. పేర్లు బయటికి ఎలా పొక్కుతున్నాయనే విషయంపై ఆయన కొంత అసహనానికి లోనైనట్లు తెలిసింది.
ఐపిఎస్‌ల బదిలీలపై రగడ
RELATED ARTICLES