ప్రధాన కార్యదర్శిగా బల్వీందర్ సింగ్ జమ్మూ
హైదరాబాద్ : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) అధ్యక్షులుగా ప్రముఖ జర్నలిస్టు ఉద్యమ నాయకులు, ప్రజాపక్షం ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న దేవులపల్లి అమర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమితులు కావడంతో రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మంగళవారం ఐజెయు కార్యవర్గం అత్యవసరంగా సమావేశమై ఆయన రాజీనామాను ఆమోదించింది. అనంతరం అధ్యక్షునిగా శ్రీనివాస్‌రెడ్డిని ఐజెయు కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అలాగే బల్వీందర్ సింగ్ జమ్మూను ఐజెయు సెక్రెటరీ జనరల్‌గా కార్యవర్గం నియమించింది. ఆయన పంజాబ్, చండీఘఢ్ జర్నలిస్టుల యూనియన్(పిసిజెయు) అధ్యక్షులుగా ఉన్నారు. యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఐజెయు ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ అయిన సబీనా ఇందర్జిత్ స్థానంలో బల్వీందర్ నియమితులయ్యారు.
నాలుగున్నర దశాబ్దాల ప్రస్థానం
ఐజెయు అధ్యక్షులుగా ఎన్నికైన కె.శ్రీనివాస్‌రెడ్డి నాలుగున్నర దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు. విశాలాంధ్ర దినపత్రికలో 40 ఏళ్ళ పాటు పనిచేసిన ఆయన ఆ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ నుండి ఎడిటర్ స్థాయికి ఎదిగారు. అనంతరం ‘మన తెలంగాణ’ దినపత్రికకు, ప్రస్తుతం ‘ప్రజాపక్షం’ దినపత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఐజెయు వ్యవస్థాపకుల్లో ఒకరు. గతంలో ఐజెయు సెక్రటరీ జనరల్‌గా మూడు దఫాలు పనిచేశారు. దేశంలోని వర్కింగ్ జర్నలిస్టుల నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాటైన మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా(మెఫీ)కు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఎపియుడబ్ల్యుజె)కు అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ వ్యవస్థాపక చైర్మన్‌గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా కూడా సేవలు అందించారు. ఐజెయు సెక్రెటరీ జనరల్‌గా నియమితులైన బల్వీందర్ సింగ్ జమ్మూ పంజాబీ ట్రిబ్యూన్‌కు చంఢీఘడ్‌లో ప్రిన్స్‌పల్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన ట్రిబ్యూన్ ఎంప్లాయీస్ యూనియన్, పంజాబ్, చండీఘఢ్ జర్నలిస్టుల యూనియన్ జనరల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. బల్వీందర్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. గతంలో ఐజెయు కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా పని చేశారు. అలాగే చండీఘఢ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు.
ఐజెయు అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక
RELATED ARTICLES