కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రక అవసరం
బిజెపి విధానాలు దేశానికి ప్రమాదకరం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/ బోనకల్ దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రిక అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం బోనకల్ మండలం గోవిందాపురం (ఎల్) గ్రామంలో తమ్మారపు వెంకట కోటయ్య సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించగా కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు తదితరులు వెంకటకోటయ్యతో పాటు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తమ్మారపు గోవింద్, తమ్మారపు భద్రయ్య, భూషయ్య, నారాయణ స్తూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మండల కార్యదర్శి వెంగళ ఆనంద రావు అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ కమ్యూనిస్టులు బలంగా ఉన్నంత కాలం పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు కార్మిక వర్గానికి అనేక హక్కులు సాధించబడ్డాయని ఆయన తెలిపారు. ప్రస్తుత పాలక వర్గాలు పేద, మధ్య తరగతి, కార్మిక వర్గాలను విస్మరించి పాలన సాగిస్తున్నాయన్నారు. ఎర్ర జెండా పార్టీలు ఎంత బలంగా ఉంటే దేశానికి అంత రక్ష అన్నారు. కమ్యూనిస్టుల అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో మరింతగా పెరుగుతుందని కమ్యూనిస్టులు చట్ట సభల్లో ఉంటేనే ఉత్పత్తి వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలను మైనార్టీ, మెజార్టీ ప్రాతిపదికన విభజించి పాలన సాగించాలని చూస్తుందన్నారు. తర తరాల నాటి పద్దతులను ఇప్పుడు అమలు చేయాలని చూస్తుందని ఆ క్రమంలోనే ఉమ్మడి పౌర స్మృతి లాంటి చట్టాలను వెలుగులోకి తీసుకు వస్తుందన్నారు. మోడీ అంబానీ, అదానీలకు ఏజెంటుగా మారారని దేశ ప్రజల కోసం కాకుండా అంబానీ, అదానీల కోసమే బిజెపి పాలన సాగిస్తుందన్నారు. రానున్న కాలంలో ఐక్య పోరాటాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన కమ్యూనిస్టు శ్రేణులకు పిలుపు నిచ్చారు. మృత వీరులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధనకు పునరంకితం కావాలని కూనంనేని కోరారు. ఈ సందర్బంగా గోవిందాపురం (ఎల్) గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కొండపర్తి గోవిందరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు, ఏపూరి రవీంద్రబాబు, బెజవాడ రవి, మందడపు రాణి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్‌కుమార్, పగిడిపల్లి ఏసు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్, వివిధ పార్టీల నాయకులు ఉమ్మనేని కోటయ్య, జక్కుల రామారావు, తమ్మారపు వెంకటేశ్వరరావు, తమ్మారపు బ్రహ్మం, ఏడునూతల లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు
ఐక్య పోరాటాల ద్వారా ప్రజల చెంతకు
RELATED ARTICLES