ఈటలను కోరిన కోదండరామ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
కెసిఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవ్వాలని పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల అమలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించేందుకు ముందుకు రావాలని టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. కెసిఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యమవ్వాల్సిన అవసరం ఉన్నదని వారు తెలిపా రు. హైదరాబాద్ శివారు శామీర్‌పేటలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కోదండరామ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో మాజీ ఎంఎల్‌ఎ ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, ఈటలపై సిఎం కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రధానంగా ఈటల రాజేందర్ బిజెపిలో చేరుతున్నట్టు ఉహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వారు ఈటల రాజేందర్‌తో చర్చించడం రాజకీయంగా ప్రధాన్యత నెలకొన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపిలో చేరకపోవడమే మంచిదని వారు సూచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈటల రాజేందర్ మాత్రం తన రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే విషయమై స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. భేటీ అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ నైతిక మద్దతు ఇచ్చేందుకే తాము ఈటల రాజేందర్‌ను కలిశామన్నారు. ఈటల వ్యవహారంలో సిఎం కెసిఆర్ వైఖరి సరైంది కాదని, ఈటల కుటుంబ సభ్యులను వేధించడం, కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉన్నదన్నారు. రాజకీయ విభేదాలు ఉంటే చర్చించాలి తప్ప కక్ష సాధించడం ఏమిటని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ తన వద్ద పని చేసే వారు ఎవరైనా తన నీడలోనే ఉండాలని అనుకుంటారని, వ్యక్తిగతంగా ఎదిగితే ఒప్పుకోరని, విపరీతమైన విద్వేషం చూపిస్తారని విమర్శించారు. రాజకీయంగా, ఆర్థికంగా ఒత్తిడి తీసుకొస్తారన్నారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోని సిఎం కెసిఆర్, హుజూరాబాద్ రాజకీయాలు చేయడం ఏమిటని దుయ్యబట్టారు. జూడాలు సమ్మె చేస్తుంటే వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా ఈటల రాజేందర్‌పైన దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈటల మీద దాడిని తాము ఆత్మ గౌరవం మీద దాడిగా చూస్తున్నామన్నారు. అందరం కలిసి పని చేయాలని, అది ఏ రూపం తీసుకుంటుందో భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్షలకు ఇది సమయం కాదన్నారు. ఈటల రాజేందర్ తప్పు చేస్తే మంత్రి పదవి నుంచి తొలగించిన సిఎం, ఎంఎల్‌ఎ పదవి నుంచి ఎందుకు సస్పెండ్ చేయాలేదని ప్రశ్నించారు. భూములు ఆక్రమిస్తే పార్టీలో ఎందుకు పెట్టుకున్నారన్నారు. కొత్త రాజకీయ పార్టీ విషయంలో తమకు తొందర లేదని స్పష్టం చేశారు. ముందుగా కొవిడ్ నుంచి రాష్ట్రం గట్టెక్కడమే ముఖ్యమన్నారు. కెసిఆర్ వ్యతిరేక ఐక్యత ఇప్పటికైనా జరగాలని అభిప్రాయపడ్డారు.
ఈటలను పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి గ్రీన్‌సిగ్నల్
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను తమ తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి అధిష్టానం అంగీక రించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని బిజెపి ముఖ్యనేతలతో గురువారం మాట్లాడారు. ఈటల అంశాన్ని పార్టీ అధ్యక్షుడు జె.పి నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని ఆయన వివరించారు. అందుకు స్పందించిన పార్టీ అధిష్టానం తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలువాలని, వారికి సముచిత గౌరవం ఇస్తామని బండి సంజయ్‌కి సూచించినట్టు తెలిసింది. ఒక వేళ ఈటల రాజేందర్ బిజెపిలో చేరుతానని స్పష్టం చేస్తే ఎప్పుడు ఢిల్లీకి రావాలనేది తెలియజేస్తామని ఢిల్లీ నేతలు బండి సంజయ్‌కి సూచించినట్టు సమాచారం. కాగా ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకునే విషయమై బండి సంజయ్ రాష్ట్రానికి చెందిన బిజెపి నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు.
ఈటల రాకపై పెద్దిరెడ్డి అసంతృప్తి
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలోకి రావడం పట్ల మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈటల రాక విషయాన్ని తనతో ఒక మాట మాత్రం చెప్పరా? అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజెపిలో ఒక్క వర్గం మాత్రమే ఈటలకు మద్దతుగా మాట్లాడుతున్నారన్నారు. ఈటలతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా తనను అడగకపోవడం శోచనీయమని అసహనం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బిజెపితో వస్తే ఉప్పెన తప్పదని పార్టీకి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాను 2023లో హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని భావించానని, ఆ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు.
ఐక్య ఉద్యమానికి కదలి రండి
RELATED ARTICLES