సిమ్లాలో వచ్చేనెల మళ్లీ కలుద్దాం
బిజెపిని ఓడించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి సాగుదాం
‘పాట్నా మీట్’లో 17 ప్రతిపక్ష నేతల తీర్మానం
రానున్న కొద్దిరోజులు మంతనాలు
ఉమ్మడి వ్యూహానికి తుదిరూపు : నితీశ్ కుమార్ వెల్లడి
పాట్నా : వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ఐక్యపోరాటం చేయాలని, కలిసి పోటీ చేయాలని ‘పాట్నా మీట్’ లో 17 ప్రతిపక్షాల నాయకులు చారిత్రక తీర్మానం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) నాయకుడు నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన సమావేశానికి 32 మంది నాయకులు హాజరయ్యారు. ప్రతిపక్షాలమధ్య ఏమైనా విభేదాలు ఉంటే పట్టువిడుపుల ధోరణితో వ్యవహరిస్తూ వాటన్నింటినీ పక్కకునెట్టేసి వచ్చేనెల సిమ్లాలో జరిగే రెండో సమావేశంలో ఉమ్మడివ్యూహాన్ని రూపొందించాలని కూడా పాట్నా మీట్ తీర్మానం చేసింది. నాలుగు గంటలపాటు పాట్నా మీట్ కొనసాగింది. అనంతరం నాయకులందరూ సంయుక్త పత్రికాగోష్ఠిలో మాట్లాడారు. వామపక్షాల నాయకులు డి.రాజా (సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి), సీతారామ్ ఏచూరి (సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి, జెఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, కాంగ్రెస్‌పార్టీ పూర్వాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, సమాజ్‌వాదీపార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, పిడిపి నాయకురాలు మెహబూబా ముఫ్తీ, ఆర్‌జెడి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు ఈ పాట్నా మీట్‌లో పాల్గొన్నారు. “మేం అందరం మాట్లాడుకున్నాం, ఇది చాలా మంచి సమావేశం, సమావేశంలో అనేకమంది నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని 17 ప్రతిపక్షాల నాయకులు నిర్ణయించాం, రాబోయే కొద్దిరోజులపాటు నాయకులందరం కలుసుకుని బిజెపిని ఓడించేందుకు అవసరమైన ఉమ్మడివ్యూహ రచనకు తుదిరూపం ఇస్తాం, వచ్చేనెల రెండో సమావేశంలో ఉమ్మడివ్యూహంపై చర్చిస్తాం, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి నాయకత్వంలోని నరేంద్రమోడీపై ఐక్యంగా సమరశంఖం పూరించేందుకు ప్రతిపక్ష ఐక్యతకు శ్రీకారంచుట్టి ఒక తొలి అడుగు వేసే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది”అని నితీశ్ కుమార్ పాత్రికేయులకు చెప్పారు.“భారతదేశ యావత్ చరిత్రను బిజెపి మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నందువల్ల జాతీయ ప్రయోజనాలకోసం మేం అందరం కలిసి పనిచేస్తున్నాం” అని నితీశ్ చెప్పారు.
ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ వైఖరి చెప్పకపోతే కూటమిలో ఉండలేం: కేజ్రీవాల్
కాగా ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని అణచివేసేందుకు దొడ్డిదారిన అర్డినెన్స్ రూపంలో ఢిల్లీని పాలించేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలపై తమ వైఖరి ఏమిటో కాంగ్రెస్‌పార్టీ స్పష్టం చేయాలని ఈ సమావేశంలో అరవింద్ కేజీవ్రాల్ పట్టుపట్టారని విశ్వసనీయవర్గాల సమాచారం, కాంగ్రెస్ ఈ విషయంలో విఫలమైతే తాము తదుపరి సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉండదని కూడా ఆయన చెప్పినట్టు పిటిఐ వార్తాసంస్థ పేర్కొంది. ఈ అర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్యవ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని కేజ్రీవాల్ చెప్పినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో ఒక నాయకత్వస్థానంలో ఉండి చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్‌పార్టీ సంకోచించడం తమకు అభ్యతరకరమైన అంశమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. “కాంగ్రెస్‌పార్టీ ఈ అర్డెనెన్స్ విషయంలో బాహాటంగా ఒక ప్రకటన చేయకపోతే కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న కూటమిలో తాము ఉండటం కష్టం అవుతుందని ఆమ్ ఆద్మీపార్టీ తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్‌పార్టీ ఈ అర్డినెన్స్‌ను బాహాటంగా వ్యతిరేకించనంతవరకూ, రాజ్యసభలో కాంగ్రెస్‌పార్టీకి ఉన్న 31 మంది ఎంపీలు ఈ అర్డినెన్స్‌ను వ్యతిరేకించనంతవరకూ కాంగ్రెస్ భాగస్వామిగా ఉండే ఏ కూటమిలోనూ ఆమ్ ఆద్మీపార్టీ కొనసాగడం కష్టం అవుతుందని ప్రకటన పేర్కొంది.
ఉమ్మడి ఎజెండా సిద్ధం చేస్తాం : ఖర్గే
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాటం చేయడానికి ఒక ఉమ్మడి ఎజెండా సిద్ధం చేస్తామని కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే చెప్పారు. ప్రతిపక్షాల రెండో సమావేశం సిమ్లాలో వచ్చేనెలలో జరుగుతుందని ఆయన పాత్రికేయులకు చెప్పారు. అదేవిధంగా రాహుల్‌గాంధీ కూడా మాట్లాడుతూ, “మా మధ్య కొన్ని విభేదాలు ఉండవచ్చు, కానీ పట్టువిడుపుల ధోరణితో కలిసి పనిచేయాలని మేం నిర్ణయించాం, అదేసమయంలో మా పార్టీ సిద్ధాంతాలను, ఆలోచనలను కాపాడుకుంటాం” అన్నారు. పాట్నాలోని అనీ మార్గ్‌లో ఉన్న నితీశ్ కుమార్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.
మళ్ళీ బిజెపి వస్తే ఇక ఎన్నికలుండవ్ : మమతాబెనర్జీ
ఈ నియంత బిజెపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక దేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని తృణమూల్ కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పత్రికాగోష్ఠిలో హెచ్చరించారు. బిజెపిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించి తీరాలన్నారు. అందుకే కాషాయపార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షనాయకులందరం ఎన్నికల్లో ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. “మేం ఐక్యంగా ఉన్నాం, ఐక్యంగా పోరాడతాం, మమ్మల్ని ప్రతిపక్షం అని పిలవకండి, మేం దేశభక్తులం, మేం భారత మాతను ప్రేమిస్తున్నాం, మణిపూర్‌లో హింస చెలరేగుతుంటే మేం అందరం ఎంతో ఆవేదన చెందుతున్నాం, బిజెపి ఒక నియంతలాగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది, పాట్నాలో మొదలైన ఈ ప్రయత్నం ఒక ప్రజా ఉద్యమంగా రూపు తీసుకుంటుంది, బిజెపి చరిత్రను మార్చేయాలనుకుంటోంది, కానీ మేం చరిత్రను రక్షిస్తామని భరోసా ఇస్తున్నాం” అని మమతా బెనర్జీ అన్నారు. ఆమె వెంట టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అనేకమంది ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి వచ్చారు, ఇదెంతో మంచి సమావేశం అని అభిషేక్ బెనర్జీ అన్నారు. 543 స్థానాలు ఉన్న లోక్‌సభలో ఈ పార్టీల మొత్తం ప్రస్తుతం బలం 200 లోపు ఉంటుంది. దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో పాట్నా మీట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కశ్మీరు నుండి కన్యామారి వరకూ విస్తరించిన మనదేశంలో అధికారకాంక్షతో కాకుండా ఒక మూలసూత్రానికి, నీతి సూత్రానికి కట్టుబడి ఈనాడు పాట్నామీట్‌లో 17 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులు చేతులు కలిపి తీర్మానం చేశారని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
జెపి ఉద్యమం తరహాలో మా ఐక్య సంఘటనకు ప్రజల దీవెన : పవార్
ఒకనాడు జయప్రకాశ్ నారాయణ్ దేశంలో ఉద్యమం చేసినప్పుడు ప్రజలు దేశవ్యాప్తంగా ఏ విధంగా ఆయను ఆశీర్వదించారో అదే తరహాలో మోడీకి వ్యతిరేకంగా ఐక్యపోరాటం ప్రారంభించిన మా ప్రతిపక్ష ఐక్య సంఘటనకు ప్రజల ఆశీర్వాదాలు లభిస్తాయని ఎన్‌సిపి నాయకుడు శరద్ పవార్ అన్నారు.
“పాట్నామీట్ నుండి వచ్చిన సందేశం చాలా స్పష్టంగా ఉంది, దేశాన్ని రక్షించేందుకు మేం అందరం కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది” అని సమాజ్‌వాదీపార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి, జెఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, ఈ రోజు జరిగిన ఈ ఆరంభం దేశానికి, నాయకులందరూ సానుకూలంగా ఆలోచించి ముందుకు సాగడానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
పెళ్ళి చేసుకో రాహుల్‌కు లాలూ సలహా
పాట్నా : పాట్నామీట్ అనంతరం శుక్రవారం ప్రతిపక్ష నాయకులు పత్రికాగోష్ఠిలో పాల్గొన్నప్పుడు ఆర్‌జెడి నాయకుడు లాలూప్రసాద్ యాదవ్ రాహుల్‌గాంధీతో ముచ్చట్లాడారు. “పెళ్ళి చేసుకో” అని రాహుల్‌కు లాలూ ప్రసాద్ సలహా ఇచ్చారు. రాహుల్‌గాంధీపై తండ్రిలా వాత్సల్యం కురిపించి పెళ్ళి చేసుకోమంటూ ప్రేమగా సలహా ఇచ్చారు. ఆయన తల్లి సోనియాగాంధీకి దీనివల్ల ఎంతో బాధ భయం కలుగుతన్న విషయాన్ని ఆయన గుచ్చి గుచ్చి చెప్పారు. అందరికంటే చివరిలో కూర్చున్న లాలూ తన మాటలతో నవ్వులు కురిపించారు. “నువ్వు మా మాట వినడం లేదు, పెళ్ళి చేసుకోమంటే..” అని రాహుల్‌గాంధీతో లాలూ అని నవ్వులు కురిపించారు. మోడీ కుట్రలను చాలా బాగా ప్రతిఘటిస్తున్నావు అని శ్లాఘించారు. లాలూ జెబ్బలులేని చొక్కా ధరించి వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. “నువ్వు పెళ్ళి చేసుకోడానికి తిరస్కరిస్తుంటే మీ మమ్మీ చాలా బాధపడుతోంది, భయపడుతోంది
, మేం నీ పెళ్ళి ఊరేగింపులలో పాల్గొనాలని కోరుకుంటున్నాం” అని లాలూ ప్రసాద్ అన్నారు. దాంతో రాహుల్‌గాంధీ ఒక చిరునవ్వు నవ్వారు.