ఎంపి రేవంత్‌రెడ్డి కేసులో పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్ : అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేశారన్న కేసులో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపి రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసే ముందు చట్టప్రకారం ఆయనను ఏ నేరారోపణలపై, ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నారో తెలియజేశారో లేదో వివరించాలని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పోలీస్‌స్టేషన్ వద్దకు రేవంత్ వచ్చి లొంగిపోతేనే పోలీసులు అరెస్ట్ చేశామని చెబుతున్నప్పుడు ఇలాంటి సమయంలో సిఆర్‌పిసిలోని 41ఎ కింద నోటీసు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. రేవంత్‌రెడ్డి బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తులపై పోలీసుల వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది. ఈమేరకు శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు. రేవంత్‌పై పోలీసులు పెట్టిన డ్రోన్ల వినియోగ కేసును కొట్టేయాలని, బెయిల్ నిరాకరిస్తూ కింది కోర్టు ఆర్డర్‌ను కొట్టేయాలని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ రేవంత్‌రెడ్డి శుక్రవారం దాఖలు చేసిన 3 వేర్వేరు వ్యాజ్యాలపై పోలీసుల వాదనలతో కౌంటర్ వేయాలని ఆదేశించారు. తదుపరి విరణను ఈ నెల 17కి వాయిదా వేశారు. రాజకీయ కక్షతో రేవంత్‌రెడ్డిపై డ్రోన్ల కేసు పెట్టారని, ఆ కేసులో ఇతర నిందితులు ఆరుగురికీ బెయిల్ వచ్చిందని, రేవంత్‌రెడ్డికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సల్మాన్ ఖుర్షీద్ కోరారు. పోలీసులు పెట్టిన కేసులోని సెక్షన్ 188 కింద ఆరోపణలు నిరూపణ అయితే జైలుశిక్ష పడేది ఒక నెల లేదా రూ.200 జరిమానా లేదా ఆ రెండూ కలిపి కోర్టు శిక్ష విధింపునకు మాత్రమే అవకాశం ఉందన్నారు. చర్లపల్లి జైలుకు రేవంత్‌ను తరలించి 9 రోజులు అయిందని, బెయిల్ ఇవ్వాలన్నారు. ఎంపిగా ఉన్న రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌కు హాజరు కావాల్సి ఉందని, అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ… 188 సెక్షన్‌తోపాటు ఇతర సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టినట్లు చెప్పారు. విఐపిల ఇళ్లపై డ్రోన్లను ఎగరేస్తే.. ఇదే మాదిరిగా తీవ్రవాదులు కూడా ఇదే పనిచేసే అవకాశాలు లేకపోలేదన్నారు. ఇప్పటికిప్పుడు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేసు ఫైల్ తెప్పించుకుని అధ్యయనం చేశాక కౌంటర్ వేస్తామని చెప్పారు. దీంతో హైకోర్టు విచారణ 17కి వాయిదా పడింది. అదే రోజున మూడు రిట్లపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు?
RELATED ARTICLES