రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ధ్వజం : బాధ్యతలు స్వీకరించిన మాజీమంత్రి
ప్రజాపక్షం/హైదరాబాద్ ఏ ముఖం పెట్టుకుని బిఆర్‌ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి ప్రశ్నించారు. మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో గురువారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా డాక్టర్ జి. చిన్నారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లే నైతిక హక్కు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులకు లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్తున్నారో బిఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్లు చూడడానికా?, కుంగిన పిల్లర్లు చూడడానికా?, ధ్వంసమైన ప్రాజెక్టును చూడడానికా?, లేదా చేసిన తప్పులకు క్షమాపణ కొరడానికా? ఏ విషయం బిఆర్‌ఎస్ నాయకులు తేల్చి చెప్పాలని చిన్నారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం అవినీతిమయమేనని, నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, గొర్రెలు, చేప పిల్లల పంపిణి, దళిత బంధు వంటి ప్రతి పథకంలో అవినీతి రాజ్యం ఏలిందని చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై ఉన్న నమ్మకంతో ప్రజావాణి అదనపు బాధ్యతలు అప్పగించారని చిన్నారెడ్డి చెప్పారు. ప్రణాళిక శాఖ ద్వారా వివిధ అంశాలపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు ఆయన చిన్నారెడ్డి చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి మధ్యనే పోటీ ఉంటుందన్నారు. బిఆర్‌ఎస్ ఉనికి ఏమాత్రం ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరుగారింటిల హామీలో నాలుగో గ్యారెంటీలు అమలులోకి వచ్చాయన్నారు. త్వరలోనే మిగతా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని చిన్నారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ వంశీచంద్ రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర కుమార్ యాదవ్, డాక్టర్ ఆదిత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏ ముఖం పెట్టుకుని కాళేశ్వరం వెళ్తున్నారు?
RELATED ARTICLES