పలుమార్లు వచ్చివెళ్లినట్లుగా వెలువడిన వార్తలపై ఆసక్తికర అధ్యయనం
వాషింగ్టన్ : విశ్వవ్యాప్తంగా భూమండలం మినహాయించి ఇంకెక్కడైనా జీవజాలం వుందా అన్న అంశంపై శాస్త్రవేత్తలు విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా భూమి వంటి గ్రహాలను కనిపెట్టడంతోపాటు వాటిపై జీవరాశులు (ఏలియన్స్‌గ్రహాంతరవాసులు) వున్నాయా లేదా అన్న అంశాన్ని పరిశోధన చేసేందుకు నాసా ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించింది. అయితే ఏలియన్స్ పలుమార్లు భూగ్రహానికి వచ్చి వెళ్లి వుండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తంచేశారు. వీరి పరిశోధనలకు సంబంధించి వెలువడిన కథనాలపై ఆసక్తికరమైన అధ్యయనం మొదలైంది. కాగా, నాసా ఏలియన్లపై పరిశోధనకు 7 మిలియన్ డాలర్ల మొత్తాన్ని మంజూరు చేసింది. ఈ నిధులను కేవలం మార్స్, జూపిటర్, శనిగ్రహం, వాటికి సంబంధించిన చందమామలపై భూమి తరహా జీవజాలాన్ని గుర్తించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇందుకోసం ల్యాబొరేటరీ ఫర్ ఆగ్నోస్టిక్ బయోసిగ్నేచర్స్ (ల్యాబ్) ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. ఇతర గ్రహాల్లో జీవరాశుల గుర్తింపు కోసం ల్యాబ్ తన చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతానికి భూమిపై మాత్రమే జీవరాశులు వున్నాయన్నది సత్యం. అయితే ఇతర గ్రహాల్లో కూడా జీవులు అంటే గ్రహాంతరవాసులు, లేదా ఇతర జీవులు వుండే అవకాశం వుందన్నది అనుమానం. భూ తరహా పరిస్థితులు కొన్ని గ్రహాల్లో ఉన్నందున కచ్చితంగా అక్కడ కూడా ఏదో ఒక తరహా జీవరాశి వుండే వుంటుందని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెపుతున్నారు. ఇందుకోసం నాసాతోసహా వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇతర గ్రహాల్లో జీవరాశుల ఉనికికి సంబంధించి ల్యాబ్ (ఎల్‌ఎబి) నాలుగు అంశాల ప్రాతిపదికగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నది. రసాయన జఢత్వం విధానాలు, ఉపరితల సంక్లిష్టత, చుట్టూఉన్న పర్యావరణతో రసాయన అసమానతలు, ఇంధన బదలాయింపుకు చెందిన ఆధారాలు సేకరించడం అనే నాలుగు అంశాలు ఇందులో వున్నాయి. జీవ సంకేతాలకు ఈ నాలుగు అంశాలే ప్రాతిపదిక. వీటిలో ఏ విషయంలో విజయాలు సాధించినా, సంకేతాలు కన్పించినా జీవం ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇతర గ్రహాలపై జీవరాశులు ఉన్నదీ లేనిదీ ధృవీకరించుకోవాలన్న తుది లక్ష్యంతోనే ఈ ల్యాబ్ ద్వారా 7 మిలియన్ డాలర్ల వ్యయాన్ని భరించడానికి సిద్ధంగా వున్నామని నాసా ప్రకటించింది. జీవరాశాలకు సంబంధించిన ఎలాంటి సంకేతాలున్నా ఉపగ్రహాలను పంపిస్తామని నాసా తెలిపింది. ఇతర గ్రహాల్లో జీవరూపాలకు సంబంధించి ఇప్పుడున్న అవగాహనకు అదనంగా సమాచారాన్ని సేకరించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని జార్జిటౌన్ యూనివర్శిటీ శాస్త్రవేత్త సారా స్టివార్ట్ జాన్సన్ తెలిపారు.